ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు.. ఎవరైనా ఓకే.. ఆయనకిస్తే మాత్రం అంతే!

15 Jan, 2023 16:51 IST|Sakshi

‘‘క్యారెక్టర్‌ ఉన్న పేదవాడికైనా సీటు ఇస్తే ఎంపీనే కాదు  ఏదైనా చేస్తా... కానీ భూకబ్జాదారులు, దావూద్‌ ఇబ్రహీం లాంటి మాఫియా డాన్‌లు, చార్లెస్‌ శోభరాజ్‌ లు, రియల్‌ ఎస్టేట్‌ మోసగాళ్లు, కాల్‌మనీ సెక్స్‌ రాకెట్, పేకాట క్లబ్‌లు, నడిపేవారికి మద్దతు ఇవ్వను’’... ఇవన్నీ ఎన్టీఆర్‌ జిల్లాలోని టీడీపీ నేతలను ఉద్దేశించి  విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన సంచలన వ్యాఖ్యలు... 

సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ రోజు టీడీపీలో  సంకుల సమరం ఊపందుకుంది. కొన్నేళ్లుగా ఆధిష్టానం తీరుపై మండిపడుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈసారి ఏకంగా టికెట్ల పంచాయితీనే తెరపైకి తెచ్చారు. తన తమ్ముడు కేశినేని చిన్నితో పాటు, మరో ముగ్గురు, నలుగురికి టికెట్లు ఇవ్వటానికి వీల్లేదని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఆ జాబితాలో మైలవరం  మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా, విజయవాడ పశ్చిమ నియోజక వర్గ నేత బుద్ధా వెంకన్న, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఉండటం గమనార్హం.

తద్వారా విజయవాడలో తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని  కేశినేని నాని చెప్పడం అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఇటీవల మైలవరంలో దేవినేని ఉమాను టార్గెట్‌ చేస్తూ హాట్‌ కామెంట్‌లు చేశారు. ఆయనతో పాటు కొంతమంది పార్టీకి దూరంగా ఉండి కొత్తవారికి అవకాశం ఇస్తే బెటరనే కామెంట్లు చేశారు. నాలుగు సార్లు గెలిచానని విర్రవీగొద్దని దేవినేనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టికెట్టు ఇస్తే ఓడిపోవడం ఖాయమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆ వేడి తగ్గక ముందే తీవ్రస్థాయిలో తన తమ్ముడు చిన్నితో పాటు, మరో నలుగురికి పార్టీ టికెట్లు ఇవ్వవద్దంటూ అధిష్టానం పెద్దలకు పరోక్షంగా వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీ ప్రత్యర్థుల మీద, అధిష్టానం మీద ఆఫ్‌ ద రికార్డుగా కాకుండా ఆన్‌ రికార్డుగానే లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇవ్వటం ప్రస్తుతం ఆ పారీ్టలో చర్చనీయాంశంగా మారింది. 

లోకేష్‌కు కౌంటర్‌ స్టేట్‌మెంట్‌? 
తాను విజయవాడ వెస్ట్‌ నియోజక వర్గం నుంచి పోటీచేస్తానని  బుద్ధా వెంకన్న ప్రకటించిన కొన్ని రోజులకే ఎంపీ కేశినేని నాని కౌంటర్‌ ఇవ్వడం ప్రా«ధాన్యత సంతరించుకొంది. లోకేష్‌ అండతోనే బుద్ధా వెంకన్న  ఆ ప్రకటన చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ విషయం తెలిసి కూడా బుద్ధా వెంకన్నకు టికెట్టు ఇవ్వటానికి వీల్లేదని చెప్పడం, మరోవైపు తన తమ్ముడు చిన్నిని ప్రోత్సహిస్తున్న లోకేష్‌కు పరోక్షంగా కేశినేని నాని కౌంటర్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టయింది.

తనకో క్లారిటీ ఉందని కరప్షన్‌ కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, జీవితంలో ఎవరినీ మోసం చేయలేదని కేశినేని నాని చంద్రబాబుకు సైతం పరోక్షంగా చురకలంటించారు. ఎన్టీఆర్‌ గొప్ప ఆశయంతో టీడీపీని స్థాపించారని, ఆ ఆశయంతో పనిచేసేవారు చేయొచ్చునని, కాదని ఇలాంటి  వారికి సీట్లు ఇస్తే పారీ్టకి గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.  టీడీపీని ప్రక్షాళన చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేయడం పార్టీలో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. 

పక్కా వ్యూహంతోనే... 
పక్కా వ్యూహంతోనే ఎంపీ కేశినేని నాని పార్టీపై తిరుగుబాటు చేయడంతో చంద్రబాబు, లోకేష్‌ నుంచి కనీసం ప్రతిస్పందన లేకుండా పోయింది. లోకేష్‌ అండతో హడావుడి చేస్తున్న ఆ నలుగురు కూడా కిమ్మనకుండా ఉండటం గమనార్హం. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఎంపీ కేశినేని నాని ఈ దాడిని మరింత  పెంచే సూచనలు కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. దీంతో పార్టీలో నేతల మధ్య మరింత అంతరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయనే భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాలను బట్టి టీడీపీలో మున్ముందు వర్గపోరు మరింత బజారున పడే అవకాశాలు స్పష్టంగా కనిసిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు