వంద చీరలు.. పది ట్రై సైకిళ్లు పంచి దానకర్ణుడిలాగా కలరింగ్: కేశినేని నాని

17 Jan, 2023 09:27 IST|Sakshi

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: వచ్చే ఎన్నికల్లో పోటీపై విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు పార్టీలతో పనిలేదని.. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు. చంద్రబాబు టికట్‌ ఇవ్వకుంటే ఏమవుతుంది అంటూ ప్రశ్నించారు.

ఈమేరకు ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ.. మోడీని నిండు సభలో వ్యతిరేకించా.. అయినా బెజవాడలో పనులు ఆగాయా..? దటీజ్ కేశినేని నాని. నన్ను.. నా పర్సనాల్టీని డీగ్రేడ్ చేయాలని చూడొద్దు. నన్ను డీ-గ్రేడ్ చేయాలని చూస్తే.. అంతగా నా పర్సనాల్టీ పెరుగుతుంది. 2013కు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువ ఉండేవి. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకంతో నేను టీడీపీలో చేరాను. నేను 2013లో టీడీపీలో చేరాకే వైసీపీలోకి వలసలు ఆగాయి. టాటా ట్రస్టుతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాను అని చెప్పారు. 

కేశినేని చిన్నిపై సెటైర్లు
తన సోదరుడు కేశినేని చిన్నిపై ఎంపీ నాని సెటైర్లు వేశారు. వంద చీరలు.. పది ట్రై సైకిళ్లు పంచి కొందరు దానకర్ణుడిలాగా కలరింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ దాన కర్ణుల చరిత్రేంటో..? ఎక్కడి నుంచి ఊడిపడ్డారో చరిత్ర చూడండి అని కోరారు. 'ఎన్నికలనగానే వస్తారు.. ఫౌండేషన్ అంటారు.. సేవా కార్యక్రమాలంటారు. వీరికి డబ్బులెక్కడి నుంచి వచ్చాయో ఇన్వెస్టిగేట్ చేయండి. పార్టీలో పేదోళ్లకు డబ్బులిస్తారు.. జిందాబాద్‌లు.. జైజైలు కొట్టించుకుంటారు.. ఇదేనా రాజకీయం. ఓ చిన్న మాట కోసం నా వ్యాపారాలు వదిలేసుకున్నా. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, సెంట్రల్ ఇండియాలో బస్సుల వ్యాపారంలో నేను కింగ్. ఎంపీగా మాట్లాడుతున్నారా..? ఆపరేటర్‌గా మాట్లాడుతున్నారా..? అన్నందుకు నేను వ్యాపారం వదిలేసుకున్నాను. లోఫర్లు.. ల్యాండ్ గ్రాబర్లు వచ్చి ఏదో చేస్తే.. ప్రొజెక్షన్ ఇస్తున్నారు అని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు