టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు.. ఫాంహౌజ్‌ వద్ద పరిస్థితేంటి?

27 Oct, 2022 10:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీ ఫిరాయించేలా నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభా పెట్టినందుకు ముగ్గురిని అరెస్ట్‌ చేయడం కలకలం రేపుతోంది.  మునుగోడు ఉప ఎన్నిక వేళ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనంగా మారింది. తమ ఎమ్మెల్యేను బీజేపీ కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని టీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపిస్తుండగా.. తమకు అలాంటి అవసరమే లేదని బీజేపీ చెబుతోంది. తాజాగా ఈ కేసులో కీలక అంశాలు వెలుగు చూశాయి. 

84 సీసీ కెమెరాల్లో ఈ ఆపరేషన్‌ దృశ్యాలు రికార్డయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్‌ నుంచి సంప్రదింపులు జరిపినట్లు గుర్తించిన పోలీసులు ఫామ్‌హౌజ్‌లో గంట 20 నిమిషాల వీడియో ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాడీవోర్న్‌ కెమెరాలో సంభాషణ దృశ్యాలు రికార్డ్‌ అయిన దృశ్యాలను సేకరించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు మూడు రోజులుగా నిఘా పెట్టి చివరకు రంగంలోకి దిగారు.
చదవండి: బేరసారాలకు టీఆర్‌ఎస్‌ లొంగదు: ఎమ్మెల్యే బాలరాజు

ఎమ్మెల్యేల కొనుగోలు ఘటనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరెప్షన్‌ యాక్ట్‌ 8. సెక్షన్‌ 120బి కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతం మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇతరులను లోపలికి రాకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫామ్‌హౌజ్‌లోనే ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీ జగధీశ్వర్ రెడ్డి మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌కు చేరుకున్నారు. పట్టుబడ్డ కారు, నగదు సైతం అక్కడే ఉంది. 
చదవండి: తొందరపడి ఒక కోయిల ముందే కూసింది: రేవంత్‌

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఘటనపై గురువారం సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రలోభ పెట్టి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు వినిపిస్తున్న ఈ కేసులో కీలకంగా ఉన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. పైలట్‌ రోహిత్‌ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం వీరంతా ప్రగతిభవన్‌లోనే ఉన్నారు. బేరసారాల ఆడియో టేపులు ఉన్నాయని ఎమ్మెల్యేలు అంటున్న నేపథ్యంలో.. వాటిని కూడా మీడియా ముందు బయటపెట్టే అవకాశం ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు