‘రైతుల్లో ఖలిస్థాన్‌ వేర్పాటు వాదులు’

28 Nov, 2020 19:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం శనివారం నాడు ఢిల్లీ నగరాన్ని ముట్టడించడం పట్ల హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల ప్రదర్శనలో ‘ఖలిస్థాని’ వేర్పాటు వాదులున్నట్లు తమకు సమాచారం అందిందని ఆరోపించారు. ‘రైతుల ప్రదర్శనలో అవాంఛిత శక్తులు ఉన్నట్లు మాకు ఇంటెలిజెన్స్‌ నివేదికలు అందాయి. బలమైన ఆధారాలు దొరికినాకా ఆ శక్తుల వివరాలను వెల్లడిస్తాం’ అని మీడియాతో చెప్పారు. 
(చదవండి : దేశ రాజధానిని తాకిన రైతుల సెగ)

‘జబ్‌ ఇందిరాగాంధీ కో హే కర్‌ సక్తే హై, తో మోది కో క్యోం నహీ కర్‌సక్తే (ఇందిరాగాంధీనే చేసినప్పుడు మోదిని చేయలేమా!)’ అని కొంతమంది రైతులు నినాదాలు ఇస్తోన్న ఆడియో, వీడియో క్లిప్పులు తమ వద్దకు వచ్చాయని కూడా కట్టర్‌ తెలిపారు. ప్రత్యేక ‘ఖలిస్థాన్‌’ కోసం జరిగిన వేర్పాటు ఉద్యమాన్ని నాటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ అణచి వేసిన నేపథ్యంలో 1984లో ఇందిరాగాంధీని ఆమె బాడీ గార్డులే హత్య చేయడం తెల్సిందే. రైతులు ఆందోళనలో తమ హర్యానా రాష్ట్రానికి చెందిన రైతులెవరూ లేరని, పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన రైతులు ఉన్నారంటూ కూడా కట్టర్‌ ఆరోపణలు చేశారు. రైతులను పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరేందర్‌ సింగ్‌ రెచ్చగొడుతున్నారని కూడా ఆయన విమర్శించారు.

మరిన్ని వార్తలు