Khammam BRS Meeting: దేశ రాజకీయాలను ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభ మలుపు తిప్పుతుందా? వాస్తవ పరిస్థితేంటి?

19 Jan, 2023 21:13 IST|Sakshi

భారత రాష్ట్ర సమితి అట్టహాసంగా ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం అయింది. కేంద్రం లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని సభలో మాట్లాడిన ప్రధాన వక్తలు ధీమాగా చెప్పారు. వారి ఉపన్యాసాలలో విమర్శల ఘాటు కనిపించింది కాని, కేవలం వీరు మాత్రమే జమ అయితే బిజెపిని ఓడించగలరా? అన్న సందేహం కలుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వచ్చే ఎన్నికలలో మీరు ఇంటికి, మేము ఢిల్లీకి అంటూ మాట్లాడినా.. అది ఏ విధంగా సాధ్యమన్నది వివరించలేదు. ఆయన తెలంగాణలో అమలు చేస్తున్న వివిధ పథకాలను దేశం అంతటా విస్తరిస్తామని ప్రకటించారు. 

దళిత బంధు పది  లక్షల రూపాయల స్కీమ్ ను ఏటా 25 లక్షల మందికి అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే వర్తింప చేస్తామని చెప్పారు. అంటే ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున పాతిక లక్షల మందికి బడ్జెట్ కేటాయించడం అంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంటుందన్నమాట. అలాగే రైతు బంధును దేశవ్యాప్తం చేస్తామని చెప్పారు.

ఎకరాకు పదివేల రూపాయల చొప్పున కోట్ల ఎకరాలకు నిధులు ఇవ్వవలసి వస్తుంది. దీనికి ఎన్ని లక్షల కోట్లు అవుతుందో లెక్కలు వేయవలసి ఉంది. దేశం అంతటా తాగు నీరు ఇస్తామని, సాగు నీరు ఇస్తామని ఆయన తెలిపారు. మీది ప్రైవేటైజేషన్ అయితే మాది నేషనలైజేషన్ అని ఆయన అన్నారు. వేటిని ఆయన జాతీయకరణ చేస్తారన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. దాదాపు శాసనసభ ఎన్నికలకు శంఖారావం పూరించినట్లుగానే కెసిఆర్ ప్రసంగించారు. 

కాకపోతే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటివారిపై వ్యక్తిగత దాడి చేయలేదు. కేవలం కేంద్ర విధానాలపైనే దుయ్యబట్టారు. ఇది ఒక రకంగా మంచిదే అని చెప్పాలి. వ్యక్తిగత దూషణలో, విమర్శలో చేస్తే, అసలు ఆయన చెప్పదలచిన ముఖ్యమైన పాయింట్లు సైడ్ ట్రాక్ అయ్యే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ రోజు కూడా ఆయన చెప్పిన విషయాలలో అనేకం గతంలో వివరించినవే. కాకపోతే ఈ రోజు బిఆర్ఎస్ ఆవిర్భావ సభ కనుక వాటిని ప్రజలకు తెలియచేయడం సందర్భోచితం అని చెప్పాలి. పూర్తి ఎజెండాను మళ్లీ చెబుతానని ఆయన ప్రకటించారు. 

ఈయన ఎజెండాను సభలో పాల్గొన్న వామపక్ష నేతలు కాని, సమాజ్ వాది పార్టీ , ఆమ్ ఆద్మి పార్టీ నేతలు కాని ఎంతవరకు ఆమోదించారో తెలియదు. ఎందుకంటే ఎవరికి వారికి సొంత ఎజెండా ఉంటుంది. వీరంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడలేదు. కాకపోతే కెసిఆర్ స్కీమ్ లను జనరల్ గా ప్రశంసించారు. గతంలో పాదయాత్రలు చేసి, నిరసన యాత్రలు చేసి కెసిఆర్ ను విమర్శించిన వామపక్షాలు ఇప్పుడు ఆయనను సమర్ధిస్తున్నాయి. దీనికి కారణం కెసిఆర్ బిజెపిని బహిరంగంగా వ్యతిరేకించడమే అని చెప్పనవసరం లేదు. 

అదే సమయంలో కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్న డి.ఎమ్.కె., శివసేన, జార్కండ్ ముక్తి మోర్చా వంటి పక్షాల  నేతలు సభకు హాజరు కాలేదు. అలాగే తనకు సన్నిహితంగా ఉంటున్న కర్నాటక నేత, జెడిఎస్ అధినేత కుమారస్వామి కూడా రాకపోవడం గమనించదగిన అంశమే అవుతుంది. తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేతలు మమత బెనర్జీ, శరద్ పవార్, జెడియు అదినేత నితీష్ కుమార్, ఆర్జెడి అధినేత తేజస్వియాదవ్ వంటివారు కూడా హాజరు కాకపోవడం కెసిఆర్ కు కాస్త ఆశాభంగమే అవుతుంది. 

బిఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న ఎమ్.ఐ.ఎమ్ అధినేత ఒవైసీని ఎందుకు ఆహ్వానించలేదన్న ప్రశ్న వస్తుంది. ఆయన హాజరైతే కొన్ని పార్టీలకు ఇబ్బందిగా ఉంటుందని భావించారేమో తెలియదు. అయితే తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారానికి ఖమ్మం సభ ఒక రిహార్సల్ గా ఉపయోగపడి ఉండవచ్చు. అంతకుమించి ఈ సభ ద్వారా అయితే మొత్తం జాతీయ స్థాయి వచ్చేసిందని చెప్పజాలం. కాంగ్రెస్ కూటమితో విబేధాలు ఉన్నంతకాలం ఇది పూర్తి రూపం దాల్చడం కష్టమే. కాని ఈ మాత్రం అన్నా నేతలు రావడం కెసిఆర్ కు ఒక రకంగా ప్రతిష్టాత్మకమే అని ఒప్పుకోవాలి. 

ముగ్గురు సి.ఎమ్.లు వచ్చి సభలో పాల్గొనడం ద్వారా కెసిఆర్ కు పరువు దక్కించారు. శాసనసభ ఎన్నికలలో విజయం సాధించడానికి ఇది వేదిక అవుతుంది. తాను లోక్ సభ ఎన్నికలలో గెలిస్తే దేశానికి నాయకత్వం వహిస్తానన్న ప్రచారం చేసుకోవడానికి, తద్వారా రాజకీయంగా లాభం పొందడానికి ఈ సభ ఉపకరింవచ్చు. మిగిలిన నేతలలో ఒక్కొక్కరు ఒక్కో సబ్జెక్ట్ పై కేంద్రీకరించారు. బిజెపి విధానాలను కేరళ ముఖ్యమంత్రి విజయన్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తే, గవర్నర్ ల వ్యవస్థ తీరుతెన్నులను ఆమ్ ఆద్మి పార్టీ నేతలు దుయ్యబట్టారు. కేజ్రీవాల్ ఢిల్లీలో స్కూళ్లు, ఆరోగ్యకేంద్రాలు వంటివాటిలో తీసుకు వచ్చిన మార్పులు వివరించి దేశం అంతటా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 

అఖిలేష్  యాదవ్ యుపి రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నేతలు ఇంగ్లీష్, హిందీ భాషలలో మాట్లాడడం తో సభికులకు తొంభై శాతం మంది కి అర్ధం అయ్యే అవకాశం లేదు. దాంతో వారు తగురీతిలో స్పందించలేకపోయారని చెప్పాలి. వారికి ప్రత్యేకంగా తెలుగు అనువాదకులను పెడితే టైమ్ ఎక్కువ తీసుకుంటుందని భావించి ఉండవచ్చు. ఏది ఏమైనా బిఆర్ఎస్ సభ ఆసాంతం ప్రశాంతంగా , విజయవంతంగా ముగియడం వరకు కెసిఆర్ కు ఆనందం కలిగించే అంశమే. దేశ రాజకీయాలను ఈ సభ మలుపు తిప్పుతుందని, దేశం అంతటిని ఈ సభ ఆకర్షిస్తుందని బిఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ విధంగా   ఆశించిన ఫలితం ఎంతవరకు దక్కిందన్నది ప్రశ్నార్ధకమే అని చెప్పక తప్పదు.
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు