ఖమ్మంలో సై అంటే సై అంటున్న కారు, కాంగ్రెస్.. హస్తం పార్టీ ప్రతీకారం తీర్చుకుంటుందా?

30 Apr, 2023 21:12 IST|Sakshi

ఖమ్మం జిల్లాలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటలే మంటలు రేపుతున్నాయి. పంచ్ డైలాగ్స్‌ తూటాల్లా పేలుతున్నాయి. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌ రేణుకా చౌదరి మంత్రి పువ్వాడ అజయ్‌ను పాతాళంలోకి తొక్కాలని పిలుపునిచ్చారు. దమ్ముంటే తన మీద పోటీ చేసి గెలవాలని రేణుకకు కౌంటర్ ఇచ్చారు పువ్వాడ అజయ్. కారు, కాంగ్రెస్ సై  అంటే సై అంటున్న ఖమ్మంలో ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోందో చూద్దాం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌ రేణుకా చౌదరి మధ్య మంటలు రేగుతున్నాయి. ఇద్దరు సై అంటే సై అంటున్నారు. ఒకరి మీద ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. ఖమ్మంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పాల్గొన్న నిరుద్యోగ ర్యాలీలో మాట్లాడుతూ..మంత్రి అజయ్‌ను అరే అంటూ సంభోదిస్తూ.. అజయ్‌ను పాతాళంలోకి తొక్కాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అజయ్ కూడా రేణుకకు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రేణుకకు దమ్ముంటే ఖమ్మంలో తన మీద పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తన మీద రేణుక గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా మంత్రి అజయ్‌ సవాల్ చేశారు. 

రాష్ట్ర మంత్రి అజయ్, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి..రాజకీయ విమర్శల స్థాయి నుంచి వ్యక్తిగత విమర్శల స్థాయికి దిగిపోయారు. ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలతో ఖమ్మంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగిలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒరిజినల్‌గా బీఆర్ఎస్‌కు ఉన్న ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్ ఒక్కరే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చెప్పుకుంటున్న ఇతరులంతా కాంగ్రెస్ నుంచి గెలిచి కారెక్కినవారే.

అందుకే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ మీద రివెంజ్ తీర్చుకోవాలనే కసితో రగలిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందంటూ మైండ్ గేమ్‌కు తెర తీసారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుక ఖమ్మం జిల్లాకు గాని, నగరానికి గాని చేసిందేమీ లేదని, రేణుక అంటే పబ్బులు, గబ్బుల చరిత్రే గుర్తుకు వస్తుందని పువ్వాడ అజయ్ రివర్స్‌లో కౌంటర్ వేశారు.

ఖమ్మం నుంచి రెండుసార్లు గులాబీ పార్టీ తరపున గెలిచిన మంత్రి పువ్వాడ అజయ్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం కూడా తక్కువేమీ కాదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మంత్రి అజయ్‌ను ఓడించాలని కాంగ్రెస్ నేతలు కంకణం కట్టుకుని కసితో పనిచేస్తున్నారు. రేణుకకు దమ్ముంటే తనపైన ఖమ్మంలో పోటీ చేయాలంటూ పువ్వాడ అజయ్ విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ నేత ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి.

రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీచేస్తారనే ప్రచారం ఓ వైపు..అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రచారం మాత్రమే చేస్తారంటూ మరోవైపు కాంగ్రెస్‌లో టాక్ నడుస్తోంది. ఒకవేళ రేణుక బరిలో ఉంటే ఖమ్మం నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. పువ్వాడ, రేణుక ఇద్దరూ ఒకే సామాజికవర్గం గనుక ఆ వర్గంలోనే చీలిక తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు పువ్వాడ అజయ్ సవాల్‌ను రేణుక ఎలా స్వీకరిస్తారా అని కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
చదవండి: పోటీకి వెనకడుగు.. ప్లాన్‌ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?

మరిన్ని వార్తలు