రాహుల్‌ ఫారిన్‌ ట్రిప్.. కుష్బు కామెంట్స్‌

28 Dec, 2020 11:23 IST|Sakshi

రాహుల్‌ గాంధీ తీరును ఎండగట్టిన కుష్బు

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజధానిలో రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలన్ని రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయి. కేంద్రం-రైతుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీరు పార్టీ శ్రేణులను ఇరకాటంలో పడేసింది. వ్యక్తగత పర్యటన నిమిత్తం రాహుల్‌ విదేశాలకు వెళ్లారు. ఆదివారం ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇటలీలోని మిలన్‌కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ పర్యటనపై బీజేపీ విమర్శలు చేస్తోంది. రైతుల పట్ల కాంగ్రెస్‌ నాయకుడి ప్రేమ ఏపాటిదో స్పష్టంగా తెలుస్తోంది అంటూ వ్యంగాస్త్రాలు సంధిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకురాలు కుష్బు రాహుల్‌ విదేశీ పర్యటనపై మండి పడ్డారు.

 ఈ మేరకు కుష్బు ‘రైతుల ఉద్యమం గురించి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ ప్రస్తుతం రాహుల్‌ గాంధీ ఎక్కడ ఉన్నారు? కొద్ది రోజుల పాటు సెలవు తీసుకుంటున్నారా.. నిజమా..? మీకు రైతుల పట్ల ఎంతో బాధ్యత ఉన్నట్లు మాట్లాడతారు.. అదే నిజమైతే మీరు వారితో కలిసి వీధుల్లో ఉండాలి కానీ.. ఇలా విదేశాల్లో ఎంజాయ్‌ చేయడం ఏంటి?’ అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాక ‘రాహుల్‌ గాంధీ నుంచి నేను ఇంతకు మించి ఇంకేమైనా ఆశించగలనా.. ఖచ్చితంగా కాదు. అసలు నేను ఆయన వ్యక్తిగత విదేశి పర్యటన వార్త గురించే ఎదురు చూస్తున్నాను. ఆయన మాటలన్ని ఉత్తి డ్రామా. కొత్తగా ఏం లేదు.. అంతా పాతదే’ అంటూ ట్విట్టర్‌ వేదికగా కుష్బు రాహుల్‌ తీరును ఎండగట్టారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ప్రకారం ప్రస్తుతం రాహుల్‌ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం కొద్ది రోజుల పాటు విదేశాల్లో గడిపేందుకు వెళ్లారు.

మరిన్ని వార్తలు