విశాఖ రాజధానిపై విషం.. ఉత్తరాంధ్ర ప్రగతికి మోకాలడ్డు

11 Oct, 2022 18:46 IST|Sakshi

2024లో అమరావతి అజెండాతోనే పోటీ చేస్తానంటూ వ్యాఖ్యలు

మూడు రాజధానులను కోరుతున్న వారిపై నోరు పారేసుకుంటున్న వైనం

మండిపడుతున్న జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు  

సొంత ప్రాంతంపై ఎటువంటి వారికైనా మమకారం ఉంటుంది. తమ ప్రాంత ప్రగతికి అవకాశం వస్తే హర్షిస్తారు.. స్వాగతిస్తారు.. సహకరిస్తారు. కానీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిలో అవేవీ మచ్చుకైనా లేవు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప తన ప్రాంత ప్రయోజనాలు అక్కర్లేదన్నట్లు విర్రవీగుతున్నారు. పదవులు ఇచ్చిన అధినేత మోచేతి నీళ్లు తాగుతూ.. వారి పన్నాగాలకు వంతపాడుతూ సొంత ప్రాంతానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రగతికి బాటలు వేసే విశాఖ రాజధానికి అడ్డం పడుతూ.. విషం కక్కుతున్నారు. అమరావతే అజెండాగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెగేసి చెబుతూ ఉత్తరాంధ్రకు ద్రోహం తలపెడుతున్నారు.  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలు బాగు కోరకుండా.. విశాఖ రాజధాని వద్దంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై జిల్లా ప్రజలు మండి పడుతున్నారు. గడిచిన ఎన్నికల్లో అచ్చెన్నాయుడిని గెలిపించి తప్పు చేశామని టెక్కలి నియోజకవర్గ ఓటర్లు అంతర్మథనం చెందుతున్నారు. మరోవైపు 2024 ఎన్నికల్లో అమరావతి రాజధానిగానే తాను ఎన్నికలకు వెళ్తానని అచ్చెన్నాయుడు ఓటర్లకు సవాల్‌ విసురుతున్నారు. ప్రజల కంటే తమ రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలు, అమరావతిలో వారికున్న భూములే ముఖ్యమని చెప్పకనే చెబుతున్నారు.  

విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని ప్రజాప్రతినిధులు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ కోరుతున్నారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. చర్చా వేదికలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు పెట్టి తమ గళం విప్పుతున్నారు. కానీ టీడీపీ నేతలకు మాత్రం ఇది రుచించడం లేదు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేయడానికైనా సిద్ధమవుతున్నారే తప్ప అమరావతిని వదులుకునేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. అమరావతి రియల్‌ ఎస్టేట్‌ రైతుల యాత్రకు మద్దతునిస్తూ ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు. 

జిల్లాలో అచ్చెన్నాయుడు అండ్‌ కో తమ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులపై పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. దద్దమ్మలని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు కూడా మూడు రాజధానుల కోసం తాము రాజీనామా చేస్తాం.. అమరావతి కోసమని రాజీనామా చేయాలంటూ అచ్చెన్నాయుడుకు సవాల్‌ కూడా విసురుతున్నారు. (క్లిక్: జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి)


ఓట్లేసిన ప్రజలు దద్దమ్మలా... 

మీకు ఓటేసినందుకు ప్రజలు దద్దమ్మలా కన్పిస్తున్నారా.. అచ్చెన్నాయుడు? చంద్రబాబు పంచన చేరి ఆయన చెప్పిన విధంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెలుగుదేశం నాయకులంతా ప్రయత్నిస్తున్నారా? ఇంతకాలం వివిధ సందర్భాల్లో రాజధాని పేరిట జరిగిన ఏర్పాటులో చాలా కోల్పోయాం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మనకు న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఇందుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉత్తరాంధ్ర ద్రోహులే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.  
శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర పట్టభధ్రుల  ఓటరు నమోదు అవగాహన సదస్సులో మంత్రి ధర్మాన ప్రసాదరావు  


ప్రజలే బుద్ధి చెబుతారు.. 

ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖను పాలనా రాజధానిగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశానికి ఇక్కడి టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించాల్సింది పోయి వ్యతిరేకించడం దారుణం. చంద్రబాబుతో సహా ఉత్తరాంధ్రలో ఉన్న టీడీపీ నాయకులంతా అభివృద్ధి నిరోధకులు. ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి.  
నరసన్నపేట: మూడో రోజు రిలే దీక్షలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌


ప్రజల మనోభావాలతో అచ్చెన్న ఆటలు..  

ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా అచ్చెన్నాయుడు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కాకుండా అమరావతి ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసం అచ్చెన్నాయుడు తాపత్రయపడుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. అచ్చెన్నాయుడుకు దమ్ముంటే విశాఖలో పరిపాలనా రాజధాని వద్దని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగలడా..! 
టెక్కలి: వికేంద్రీకరణకు మద్ధతుగా నిర్వహించిన మానవహారంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌  


ఆత్మ సాక్షిగా ముందుకు సాగాలి.. 

ఉత్తరాంధ్ర నాయకులు ఆత్మసాక్షిగా ముందుకు సాగాలి. ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలి. విశాఖపట్నం రాజధానిగా అవకాశం లభించింది. ఈ అవకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 
– ప్రొఫెసర్‌ హనుమంతు లజపతిరాయ్, పూర్వపు వైస్‌ చాన్స్‌లర్, ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్‌


అభిమానం అందరికీ ఉంటుంది 

మన ప్రాంతం అన్న అభిమానం అందరికీ ఉంటుంది. అయితే పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడుతున్నారు. పార్టీకి సైతం నచ్చజెప్పేలా నాయకులు ఉండాలి. ఉత్తరాంధ్ర ప్రగతికి విశాఖపట్నం రాజధాని కావటం మంచి అవకాశం. దీన్ని స్వాగతించాలి.
– ప్రొఫెసర్‌ తమ్మినేని కామరాజు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వ విద్యాలయం పూర్వపు రిజిస్ట్రార్‌

మరిన్ని వార్తలు