కేసీఆర్‌ సర్కార్‌ పాలనకు చరమగీతం పాడాలి

4 Oct, 2023 02:50 IST|Sakshi

తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలి 

ఇందూరు సభలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి 

సంజయ్, ఈటల, గుజ్జుల భుజం తట్టిన మోదీ 

నిజామాబాద్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని, సీఎం కేసీఆర్‌ సర్కార్‌ పాలనకు చరమగీతం పాడాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు లభిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసేలా ప్రజ లు ముందుకు రావాలని కోరారు. కల్వకుంట్ల కుటుంబానికి ముందుంది ముసళ్ల పండుగ అని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు.

అసలైన కథ ఇప్పుడే మొదలైందన్నారు. కేసీఆర్‌ను మించిన అబద్ధాలకోరు రాష్ట్రంలో మరొకరు లేరని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ విమర్శించారు. పసుపు బోర్డు ఇస్తే అభ్యర్థి ని పెట్టబోనని చెప్పిన బీఆర్‌ఎస్‌ ఏం ముఖం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందో చెప్పాలన్నారు. పసుపు రైతుల దశాబ్దాల కల ప్రధాని మోదీ నెరవేర్చారని బీజేపీ జాతీయ ఉ పాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

కేసీఆర్‌ కుటుంబ రాజకీయాలను సమాధి చేయాలని బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు పిలుపునిచ్చారు. పసుపు బోర్డు వచ్చినందుకు రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎం.రవీంద్రనాయక్, జి.విజయ రామారావు, రమేశ్‌ రాథోడ్, గరికపాటి మోహన్‌రావు, బూర నర్సయ్యగౌడ్, డి.ప్రదీప్‌రావు తదితరులు పాల్గొన్నారు. అరుణతార వందన సమర్పణ చేశారు. సభ ముగిశాక వేదికపైనే బండి సంజయ్, ఈటల రాజేందర్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ప్రధాని భుజం తట్టి అభినందించారు. కొన్నేళ్లుగా చెప్పులు కూడా ధరించకుండా పోరాడుతున్న పసుపు బోర్డు ఉద్యమ నాయకుడు మనోహర్‌రెడ్డి గురించి సంజయ్‌ని అడిగి తెలుసుకున్నారు. 

బీజేపీలో జోష్‌ 
మోదీ బహిరంగసభ విజయవంతం కావడంతో కాషాయదళంలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అంచనాలకు మించి భారీగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరుకావడం, ప్రధాని ప్రసంగానికి జనాల్లో బాగా స్పందన కనిపించడంపై పార్టీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, అవినీతి అంశాలను మోదీ ప్రస్తావించినప్పుడల్లా కేకలు, ఈలలు, చప్పట్లతో సభికు లు మద్దతు ప్రకటించారు. తెలుగులో నా కుటుంబ సభ్యులారా.. అని అనగానే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రసంగం మధ్యలో మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు.   

మరిన్ని వార్తలు