అమరవీరుల స్తూపం నుంచి   బీజేపీ ర్యాలీ 

25 Sep, 2023 02:29 IST|Sakshi

మహిళా బిల్లుకు ఆమోదంపై మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ర్యాలీ 

పెద్దసంఖ్యలో పాల్గొన్న మహిళలు

సాక్షి, హైదరాబాద్‌: మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ బిల్లు ఆమోదానికి కృషి చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం నుంచి నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాల యం వరకు ర్యాలీ జరిపారు.

మొదటగా అమరవీరులకు నివాళులర్పించి, పెద్ద సంఖ్యలో మహిళలతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, పార్టీ నేతలు దుగ్యాల ప్రదీప్‌కుమార్, చింతల రామచంద్రారెడ్డి, సినీనటి జయసుధ, ఆకుల విజయ, బండా కార్తీకరెడ్డి, రాణీరుద్రమ ఇతర నాయకులు, కార్యకర్తలు వెంటనడిచారు. ఈ సందర్భంగా ఎటు చూసినా కాషాయ జెండా పట్టుకుని జయహో మోదీ అంటూ నినాదాలు చేశారు.  

కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలి 
ఢిల్లీలోని నూతన పార్లమెంట్‌ భవనంలో మొట్టమొదటి బిల్లు మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించడం చరిత్రాత్మక సందర్భమని కిషన్‌రెడ్డి అన్నారు. అరవై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో పార్లమెంటులో అనేకమార్లు చర్చ జరిగినప్పటికీ మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలుకు నోచుకోలేదన్నారు.

‘సుమారు 50 శాతం మంది మహిళలున్న తెలంగాణలో.. తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్‌.. తన మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదు. పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించిన ఏకైక పార్టీ మజ్లిస్‌. కేసీఆర్‌ గురువు అసదుద్దీన్‌ ఓవైసీ. పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎంతో అంటకాగుతున్న కేసీఆర్‌.. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు