పూర్తి ఫలితాలు వచ్చాక హంగ్‌పై స్పందిస్తాం: కిషన్‌రెడ్డి

4 Dec, 2020 20:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఫలితాల్లో అధికార టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య హోరా హోరిగా పోరు సాగింది. టీఆర్‌ఎస్‌ 56 స్థానాలు దక్కించుకొని అతిపెద్ద పార్టీగా నిలవగా బీజేపీ 47 డివిజన్లలో విజయ కేతనం ఎగురవేసి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.  దుబ్బాక ఉప ఎన్నిక జోష్‌లో ఉన్న బీజేపీ గ్రేటర్‌లో మరింత దూకుడుగా వ్యవహరించింది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నాలుగు సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ ఈ సారి భారీగా పుంజుకుంది. చదవండి: బీఎన్‌రెడ్డి నగర్‌లో టీఆర్‌ఎస్‌కు షాక్‌.. 

జీహెచ్‌ఎంసీ ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌ మంత్రి కేటీఆర్‌ తప్పుడు ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్పారని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన సవాల్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్వీకరించాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజల ఆదరణను వేగంగా కోల్పోతుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. 2023లో అధికారానికి రావడానికి గ్రేటర్‌ ఎన్నికలు ప్లాట్‌ ఫామ్‌గా నిలిచిందన్నారు. చదవండి: టీఆర్‌ఎస్‌ కొంపముంచిన డమ్మీ అభ్యర్థి..! 

టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీపై టీఆర్‌ఎస్‌ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని అన్నారు. అక్రమ కేసులు పెట్టినా.. బీజేపీ కార్యకర్తలు వెనకడుగు వేయలేదని, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతీయులను సోషల్‌ మీడియా ద్వారా టీఆర్‌ఎస్‌ భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. కూలిపోతున్న టీఆర్‌ఎస్‌ పార్టీలోకి తమ కార్పోరేటర్లు వెళ్లరని స్పష్టం చేశారు. అదే విధంగా పూర్తి ఫలితాలు వచ్చాక హంగ్‌పై స్పందిస్తామన్నారు. చదవండి: పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌ రాజీనామా 

మరిన్ని వార్తలు