భయపడొద్దు.. ఎదుర్కొందాం : కిషన్‌రెడ్డి

26 Oct, 2020 22:46 IST|Sakshi

ప్రశాంత్‌నగర్‌ (సిద్దిపేట): రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులకు, వారి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, దుబ్బాక ఉప ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిద్దామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. సిద్దిపేట పట్టణంలో దుబ్బాక బీజే పీ అభ్యర్థి మామ ఇంట్లో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తనిఖీల అనంతరం రఘునందన్‌రావును సోమవారం రాత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులను పరిశీలించారు. రఘనందన్‌రావు కుటుంబసభ్యులను వివరా లు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాలపై అధికారులతో నిర్బంధం విధించడం సరికాదన్నారు. సెర్చ్‌వారెంట్‌ లేకుండా పోలీసులు ఇళ్లంతా చిందరవందర చేసి, మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించారన్నారు. ఎన్నికల ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న జితేందర్‌రెడ్డి, వివేక్‌లను హైదరాబాద్‌కు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్‌కు బలవంతంగా తరలించారన్నారు.  

అధికారం శాశ్వతం కాదనేది టీఆర్‌ఎస్‌ గుర్తించాలి 
నియంతృత్వ పరిపాలనను తెలంగాణ ప్రజ లు తిప్పికొడతారన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయం గుర్తించాలన్నారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, చెన్నారెడ్డి లాంటి హేమాహేమీలను ఓడించిన ఘన చరిత్ర ప్రజలకు ఉందన్నారు. అధికారం మా కుటుంబానికి మాత్రమే శాశ్వతం అనే పద్ధతి సరికాదన్నారు. రఘునందన్‌రావుకు ప్రచారం నిర్వహించుకు నే హక్కు ఉందన్నారు. తెలంగాణతో సహా అనేక ఉద్యమాల్లో పాల్గొన్న రఘునందన్‌రావును ప్రభుత్వం నిర్బంధం చేయడం సరికాదన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యకర్తలు శాంతియుతంగా గ్రామాల్లో ప్రచా రం నిర్వహించాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలువబోతోందని, అందుకే అధికార పార్టీ అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తోందన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా