అంతా ప్రగతి భవన్‌ ప్లాన్‌.. మునుగోడు ఉప ఎన్నిక కోసం ఇంత డ్రామా అవసరమా?

27 Oct, 2022 02:26 IST|Sakshi

సంప్రదింపులు జరిపామని చెబుతున్నవారితో మాకు సంబంధం లేదు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టీకరణ

ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తామని వెల్లడి

ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని చెబుతున్నదంతా ప్రగతిభవన్‌ ప్లాన్‌ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభివర్ణించారు. మునుగోడు ఉపఎన్నిక కోసం ఇంత డ్రామా అవసరమా అని ప్రశ్నించారు. దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. సంప్రదింపులు జరిపారని చెబుతున్న వారితో తమకెలాంటి సంబంధం లేదని, దీనిపై కేంద్ర విచారణ సంస్థలతో దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్న పేర్లను తొలిసారి వింటున్నామని చెప్పారు.

బుధవారం అర్ధరాత్రి గుజరాత్‌ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఫోన్లో స్పందించారు. ఎమ్మెల్యేల కోనుగోలుకు తమ దగ్గర వందకోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. మునుగోడులో ఓడిపోతామనే ఈ కుట్ర చేస్తున్నారన్నారు. డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. టీఆర్‌ఎస్‌లా తాము ఎమ్మెల్యేలను చేర్చుకోలేదన్నారు.

దిగజారి రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. ‘పార్టీలు ఫిరాయించడం నేరమా? ఎంతోమంది పార్టీలు మారుతున్నారు. టీఆర్‌ఎస్‌ కూడా 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా?’అని ప్రశ్నించారు. పోలీసులు, స్వామీజీలు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఎవరు వచ్చినా చేర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉండగా తన వద్దకు చాలామంది వచ్చారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు