కేసీఆర్‌వి దిగజారుడు రాజకీయాలు

24 Aug, 2022 02:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరంకుశ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సంజయ్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లా డుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబానికే తెలంగాణను పాలించే హక్కు ఉన్నట్లు వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమన్నారు. రూ. 2 లక్షల కోట్ల విలువైన దళితబంధు పథకాన్ని ప్రకటించినా హుజూరాబాద్‌ ప్రజలు సీఎం కేసీఆర్‌ అహంకారాన్ని ఓడించారనే విష యాన్ని మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు.

గవర్నర్‌ వ్యవస్థను నిర్వీర్యం చేయడం, ప్రధానమంత్రిని అవమానించడం ఏం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబం పర్యవేక్షణలో ఆయుధాలతో సంజయ్‌ యాత్రపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. సంజయ్‌ పాదయాత్రకు తెలంగాణ ప్రజల నుంచి అశేష ఆదరణ లభిస్తోందని, యాత్రను అడ్డుకోవడం ద్వారా శాంతిభద్రతల పర్య వేక్షణ చేతకాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒప్పుకుందన్నారు. బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకనే సంజయ్‌ పాదయాత్రను అడ్డుకున్నదని పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి లేదని సంజయ్‌కి నోటీసులు ఇచ్చారని, పిరికితనంతో ఇచ్చిన ఆ నోటీసులను ఖాతరు చేయబోమని స్పష్టం చేశారు. దేశంలో అనేక పాదయాత్రలు జరిగాయని, వాటికి అనుమతి అవసరం లేదని అన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు సంబంధించి పూర్తిస్థాయిలో సీబీఐ దర్యాప్తు సాగుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర సంస్థల దర్యాప్తు ఒక్క కవిత మీదనే కాకుండా, కుంభకోణం మీద జరుగుతుందని అన్నారు. కాగా, బండి అరెస్ట్‌ను బీజేపీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ ఖండించారు. పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసి ఓర్వలేకే కేసీఆర్‌ పాదయాత్రను అడ్డుకున్నారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు