నందకుమార్‌తో పరిచయాలు ఉన్నాయి.. కానీ: కిషన్‌రెడ్డి

28 Oct, 2022 11:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీలో ఎవరైనా చేరవచ్చని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పార్టీలో చేరికల కోసం ప్రత్యేక కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. ఏ పార్టీ నుంచి వచ్చిన వారినైనా చేర్చుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. నందకుమార్‌తో తమకు పరిచయాలు ఉన్నాయి కానీ ఆయన ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వస్తే ఏంటి.. పోతే ఏంటని ప్రశ్నించారు. బీజేపీ దగ్గర డబ్బులు లేవని, డబ్బులు ఉన్నాయి కాబట్టే కేసీఆర్‌ విమానం కొంటున్నారని విమర్శలు గుప్పించారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నించారంటూ టీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారంపై మరోసారి కిషన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ‘ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరే. వేరే పార్టీ నుండి వచ్చిన వారిని మంత్రులు చేశారు. బీఎస్పీ నుంచి గెలిచిన వారికి మంత్రి పదువులు ఇచ్చారు. కాంగ్రెస్‌కు చెందిన 12 మందిని టీఆర్‌ఎస్‌లోకి తీసుకున్నారు. కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నామని కట్టుకథలు అల్లారు. ముందు రూ. 100 కోట్లు.. ఆ తర్వాత రూ. 15 కోట్లు అన్నారు. ఆ నలుగురు మా పార్టీలో చేరితే ప్రభుత్వం పడిపోతుందా?. నందకుమార్‌ తెలుసు కానీ నా అనుచరుడు కాదు. ఆయన ఎంపీ సంతోష్‌కు సన్నిహితుడు. కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ ఢిల్లీలో కాకుంటే లండన్‌లో పెట్టుకోవచ్చు.’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సెటైర్లు వేశారు. 
చదవండి: ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం.. బండి Vs కేసీఆర్‌.. యాదాద్రిలో హైటెన్షన్‌

మరిన్ని వార్తలు