కేంద్ర నిధులపై ప్రజలకు నివేదికలు

29 Aug, 2023 04:54 IST|Sakshi

జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో విడుదల.. రాష్ట్ర బీజేపీ నిర్ణయం 

గత తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం చేసిన సాయాన్ని వెల్లడించనున్న నేతలు 

పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరణ 

బుక్‌లెట్లు, కరపత్రాల పంపిణీకి నిర్ణయం 

కేంద్రంపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ దుష్ప్రచారాన్ని 

తిప్పికొట్టాలన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద తెలంగాణకు కేటాయించిన, విడుదల చేసిన నిధుల వివరాలతో నివేదికలు విడుదల చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వీటిని వెలువరించనున్నారు.

రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రూపాల్లో పెద్దెత్తున నిధులు కేటాయిస్తూ విడుదల చేస్తున్నా.. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందంటూ కేసీఆర్‌ ప్రభుత్వం, అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇది దోహదపడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, సెప్టెంబర్‌ రెండో వారంలోగా అన్ని జిల్లా, అసెంబ్లీ కేంద్రాల్లో ‘పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌’ ద్వారా మోదీ ప్రభుత్వం వివిధ శాఖలు, రంగాలకు కేటాయించిన నిధులకు సంబంధించిన గణాంకాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఆయా వివరాలతో బుక్‌లెట్లు, కరపత్రాలు కూడా పంపిణీ చేయాలని తీర్మానించారు.  

గతంలోనే కిషన్‌రెడ్డి రిపోర్ట్‌ కార్డ్‌ 
హైదరాబాద్‌లో గత జూన్‌ 17న కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ‘ప్రజలకు మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల రిపోర్ట్‌ కార్డ్‌–తెలంగాణ అభివృద్ధికి అందించిన సహకారం’ పేరిట పవర్‌పాయింట్, డిజిటల్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కేంద్రం నుంచి అందిన సాయానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.

వివిధ ప్రభుత్వ శాఖలు, రంగాల వారీగా తెలంగాణకు అందిన నిధులు, గ్రాంట్లకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం పార్టీ సీనియర్‌ నేత డా.ఎస్‌.మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి చంద్రవదన్, తొమ్మిదేళ్ల అభివృద్ధిపై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడారు. 

17లోగా అవగాహన కల్పించాలి 
     కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా ప్రజలకు వివరించాలని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాలు, వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు.

గత తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వ పాలనలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, అభివృద్ధిలో కేంద్రం పాత్రకు సంబంధించిన వివరాలు గడపగడపకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి సమావేశాల్లో వివిధ రంగాల ప్రముఖులు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, రిటైర్డ్‌ అధికారులను భాగస్వామ్యం చేసుకుంటూ సెప్టెంబర్‌ 17లోగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కిషన్‌రెడ్డి సూచించారు.   

మరిన్ని వార్తలు