పరీక్షలు నిర్వహించలేని స్థితిలో కేసీఆర్‌ సర్కార్‌: కిషన్‌రెడ్డి ఫైర్‌

24 Sep, 2023 13:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌పై రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను హైకోర్టు మళ్లీ రద్దు చేయడంపై కిషన్‌రెడ్డి ఫైరయ్యారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాగా, కిషన్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అప్పులు చేసి నిరుద్యోగులు కోచింగ్‌ తీసుకున్నారు. మొదటి సారి గ్రూప్‌-1 పరీక్ష పేపర్‌ లీక్‌ అయ్యి, అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. నిన్న హైకోర్టు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను మళ్లీ రద్దు చేసింది. దీనికి సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలి. కేసీఆర్‌ ప్రభుత్వం నరక కూపంగా మారింది. కేసీఆర్‌ సర్కార్‌ తీరు వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పరీక్షలు నిర్వహించలేదని స్థితిలో కేసీఆర్‌ ప్రభుత్వం ఉంది అని ఘాటు విమర్శలు చేశారు. 

లీకేజీతో ఓసారి.. నిర్లక్ష్యంతో మరోసారి 
వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ జారీకాగా.. 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ గతేడాది అక్టోబర్‌ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్‌ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. కానీ టీఎస్‌పీఎస్సీ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం బయటపడటంతో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ను పరీక్షను రద్దు చేసింది.

మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఈ నిర్ణయంతో గందరగోళంలో పడ్డారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అందరికీ తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ పరీక్షలను నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి ప్రిలిమ్స్‌కు 3,09,323 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోగా.. 2,33,248 మంది పరీక్ష రాశారు. ఈసారి ప్రిలిమ్స్‌ నిర్వహణ లోపభూయిష్టంగా, అక్రమాలకు తావిచ్చేలా ఉందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రెండో ప్రిలిమ్స్‌నూ రద్దు చేయాలని సర్కారును ఆదేశించింది. 

రద్దయితే వచ్చే ఏడాదే? 
గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ రద్దు తీర్పుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఒకవేళ రద్దు తీర్పును డివిజన్‌ బెంచ్‌ సమర్థిస్తే.. మూడోసారి ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఇప్పట్లో ప్రిలిమ్స్‌ నిర్వహణ సాధ్యంకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం.. పరీక్ష కోసం కనీసం రెండు నెలల గడువు ఇస్తూ తేదీని ప్రకటించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: పేపర్లు లీక్‌ చేసి రూ.వేల కోట్లకు  అమ్ముకున్నారు!

మరిన్ని వార్తలు