అవన్నీ అబద్దాలని చెప్పే దమ్ము టీఆర్‌ఎస్‌ నేతలకు ఉందా? కిషన్‌ రెడ్డి ఫైర్‌

27 Aug, 2022 19:31 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు ఇస్తూ ఉందని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర వేల కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని అన్నారు. ఈ మేరకు వరంగల్‌ బీజేపీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రామప్ప దేవాలయం అభివృద్ధికి రూ. 60 కోట్లు ఖర్చుచేయబోతున్నట్లు తెలిపారు. వరంగల్‌ స్మార్ట్‌ సిటీ కోసం కేంద్రం రూ. 196 కోట్ల నిధులు ఇచ్చిందని తెలిపారు. వరంగల్ పోర్టుకు రూ.5 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

వేయి స్తంభాల గుడి అభివృద్ధికి కూడా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులు ఖర్చు చేసిందన్నారు. కేంద్రం నిధులు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. అవన్నీ అబద్దాలని చెప్పే దమ్ము టీఆర్‌ఎస్‌ నేతలకు ఉందా అని నిలదీశారు. కేసీఆర్‌ది తొండి ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వామని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబ పాలన, టీఆర్‌ఎస్‌ అవినీతి పాలన నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.

వరంగల్ నుంచి జగిత్యాల వరకు 4 వరుసల రహదారుల నిర్మాణం కోసం రూ. 4,000 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. వరంగల్ నుంచి ఖమ్మం వరకు 4 వరుసలు రహదారుల నిర్మాణం కోసం రూ.3360 కోట్లు ఖర్చు చేశాం. వేయి స్తంభాల గుడిలో మంటపం కూలిపోతే ఇప్పటివరకు కేసీఆర్ పట్టించుకోలేదు.. డిసెంబర్‌లోపు వేయి స్తంభాల గుడిలో మంటపం నిర్మిస్తాం. తెలంగాణలో డిఫెన్స్‌కు సంబంధించిన సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నాం. రూ.800 కోట్లతో వరంగల్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం. హెరిటేజ్, స్మార్ట్, అమృత్ సిటీలను ఈ ప్రాంతానికి ఇచ్చాం.

వరంగల్ జిల్లాకు కేసీఆర్ ఎంత ఖర్చు పెట్టాడో సమాధానం చెప్పాలి. తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చకు మేము సిద్ధం. కేసీఆర్‌ నీకుకు కళ్ళుంటే చూడు, లేకుంటే నా దగ్గరికి రా. కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోస్తే.. బీజేపీ ప్రభుత్వం వస్తుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇస్తాం. మతపరమైన రిజర్వేషన్లు ఎత్తేస్తాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి, ఆ కుటుంబాన్ని ఫార్మ్ హౌజ్ కే పరిమితం చేస్తాం’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యనించారు.

మరిన్ని వార్తలు