Kaleswaram Project: మేడిగడ్డపై సీబీఐ విచారణ అంటే ఎందుకు భయం?

14 Feb, 2024 03:42 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి కృష్ణా, కాళేశ్వరం వివాదం

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఓటేస్తే మూసీలో వేసినట్టే

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న ఆ రెండు పార్టీలు

కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవినీతిపై గత సీఎం కేసీఆర్‌ సీబీఐ దర్యాప్తునకు ముందుకు రాలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ కూడా సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే.. కాళేశ్వరంపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించడం లేదు. మేడిగడ్డపై సీబీఐ విచారణకు ఆ రెండు పార్టీలు ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలి’ అని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

మంగళవారం వరంగల్‌లో పార్టీపార్లమెంట్‌ కార్యాలయం ప్రారంభం, వేయిస్తంభాల ఆలయం కల్యాణ మంటపం పనులను పరిశీలించిన అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్‌ ఇచ్చిన తర్వాత నాటి బీఆర్‌ఎస్‌ సర్కారు, ఎన్నికల తర్వాత నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు ఉత్తరాలు పంపినా స్పందించలేదన్నారు. గత సంవత్సరం అక్టోబర్‌ 21 మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని వార్తలు రాగానే.. మరుసటి రోజు 22న తాను కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తరం రాశానని, ఆ తర్వాతి రోజే భారత ప్రభుత్వ జలశక్తి శాఖ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి.. మేడిగడ్డకు పంపిందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

అక్టోబర్‌ 24, 25న ఆ రెండు రోజులు డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ.. రాష్ట్ర అధికారులను వివరాలు అడిగి నవంబర్‌ 1న ప్రాథమిక నివేదిక తయారు చేసి రాష్ట్రానికి పంపిందన్నారు. ప్రాజెక్ట్‌ సర్వే, ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ అన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని వెల్లడించిందన్నారు. ప్రమాదకర పరిస్థితిలో డ్యామ్‌ ఉన్నదని, నీటిని ఖాళీ చేయాలని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచించిందని మంత్రి చెప్పారు. 

మేడిగడ్డపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు 
ప్రతిపక్ష, పాలక పార్టీలు ఆడుతున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ డ్యామేజీ వ్యవహారాన్ని పొలిటికల్‌ మైలేజ్‌కి కాంగ్రెస్‌ వాడుకుంటున్నదన్నారు.  అసెంబ్లీ బంద్‌ పెట్టి.. మేడిగడ్డకు ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని, ఇంతకు ముందే మంత్రులు చూశారు. రేవంత్, రాహుల్‌గాంధీ చూశారు.. ఇప్పుడు మళ్లీ ఎందుకు వెళుతున్నారో చెప్పాలి? అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తీరు అలాగే ఉన్నదని, ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్, నల్లగొండ బహిరంగ సభకు వెళ్లారని ఎద్దేవా చేశారు. 

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేసీఆర్‌ సభ
ఏపీ పోలీసులను పెట్టి బలవంతంగా కృష్ణా నీళ్లు తీసుకెళ్తే.. ఏం చేయాలో ఇప్పటివరకు యాక్షన్‌ప్లాన్‌ ఏంటో, మీ వైఖరి ఏమిటో.. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చె ప్పాలని నిలదీశారు. మీరు పరిష్కరించుకుంటే.. కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. ప్రాజె క్టుల సమస్య వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పా రు. కేంద్రంపై నిందలు వేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కేసీఆర్‌ నల్లగొండ సభ పెట్టారని, ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోరన్నారు. ఒకరు కృష్ణా జలాలపై, మరొకరు కాళేశ్వరంపై రచ్చ చేస్తూ ఎంపీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణలో ఈసారి బీజేపీ డబుల్‌ డిజిట్‌ సీట్లు గెలుస్తుందన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega