పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే అభ్యంతరాలెందుకు?

27 Aug, 2020 04:15 IST|Sakshi

ప్రతిపక్షాలు, అమరావతి జేఏసీకి మంత్రి కొడాలి నాని ప్రశ్న

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా సీఆర్‌డీఏ చట్టం చేసింది చంద్రబాబే

గుడివాడ రూరల్‌: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలకు, అమరావతి జేఏసీలకు అభ్యంతరాలేంటని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. బుధవారం కృష్ణా జిల్లా గుడివాడ మండలం లింగవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

► విజయవాడ, గుంటూరు పరిసరాల్లోని 55 వేల మంది పేదలకు అమరావతిలో ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. 
► అమరావతి జేఏసీ మాత్రం అమరావతిలో పేదవాళ్లుంటే రాజధాని కళ రాదని, మురికివాడలను తలపిస్తాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. అమరావతిలో ఉండాలనుకునేవాళ్లు 600, 1000 గజాల్లోనే ఇళ్లు కట్టుకోవాలని, పేదలకు ఇళ్ల స్థలాల అంశం సీఆర్‌డీఏ చట్టంలో లేదని కోర్టుకెక్కి ఆర్డర్‌ తెచ్చుకుంది.
► దీనికి దిక్కుమాలిన ప్రతిపక్ష నేత చంద్రబాబు మద్దతుగా నిలిచారు. పేదలకు ఇళ్ల స్థలాలివ్వకుండా సీఆర్‌డీఏ చట్టం చేసింది కూడా చంద్రబాబే. ఆ చట్టాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ రద్దు చేసి అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తానంటే జేఏసీ, టీడీపీ, రైతులు ఒప్పుకోవడం లేదు. ఇలా అయితే రాజధాని ఎలా అభివృద్ధి చెందుతుంది? దాదాపు రెండు లక్షల మందికి ప్రభుత్వం అమరావతిలో స్థిర నివాసం కల్పిస్తుంటే అడ్డుకోవడం దారుణం.

► పేదలుండటానికి వీల్లేదంటున్న ప్రాంతంలో చట్టసభలు మాత్రం ఎందుకు? ఈ విషయాన్ని సీఎం జగన్‌కు రాతపూర్వకంగా వివరిస్తాను. ఇప్పటికైనా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అమరావతి జేఏసీ, టీడీపీ నేతలు, ఫ్యూడల్‌ మనస్తత్వం ఉన్నవాళ్లు అంగీకరించాలి. 
► అమరావతిలో పేద ప్రజలకిచ్చే ఇళ్ల స్థలాలకు జేఏసీ, ఇతర పార్టీలు అడ్డుపడితే శాసనసభను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ నిర్వహించడానికి వీల్లేదు. 
► బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, ప్రజాసంఘాలు కూడా 1500 ఎకరాల్లో పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలపై మాట్లాడి కోర్టులో కేసులను వాపసు తీసుకునేలా చేయాలి. పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని ఉద్యమాలు చేసే కమ్యూనిస్టులు అమరావతి దగ్గరకు వచ్చేసరికి బాబుకు మదతివ్వడం దారుణం. 

మరిన్ని వార్తలు