కేంద్రానికి బాబు లేఖ ఓ డ్రామా!

13 Feb, 2021 04:20 IST|Sakshi

నిమ్మగడ్డ, చంద్రబాబు ఒకటే

పేదోడి రేషన్‌నూ అడ్డుకుంటారా?

మంత్రి కొడాలి నాని ధ్వజం  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా కేంద్రానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాయడం ఓ డ్రామా అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) విమర్శించారు. నిమ్మగడ్డ, చంద్రబాబు ఒకే కోవలోని వ్యక్తులన్నారు. వీళ్లిద్దరూ కలసి ఎన్ని కుట్రలు పన్నినా జగన్‌ ప్రభంజనాన్ని అడ్డుకోలేరన్నారు. పేదల ముంగిటకే రేషన్‌ తీసుకెళ్తుంటే అడ్డుపడ్డ వ్యక్తులే అడ్డగోలుగా విమర్శలు చేయడం నీతిమాలిన రాజకీయమని ఆయన ధ్వజమెత్తారు. నాని శుక్రవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘మొదటి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయంతో చంద్రబాబుకు మతిపోయింది. నిన్నటిదాకా నిమ్మగడ్డను వెనకేసుకొచ్చి, ఇవ్వాళ వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాయడం ఓ డ్రామా. కేంద్రానికేంటి ఐక్యరాజ్యసమితికీ లేఖ రాస్తాడు. ఆయన మానసిక స్థితి అలాగుంది. ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతుంటే జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ ఎన్నికల తర్వాత ఆయన్ను, ఆయన కొడుకుని టీడీపీ క్యాడర్‌ తరిమికొట్టడం ఖాయం’’ అని దుయ్యబట్టారు. 

వక్రీకరించి వార్తలు రాయడం దారుణం..
పేదల ఇంటివద్దకే నిత్యావసరాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే 9,260 వాహనాలను తీసుకున్నామని, వీటి ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఇచ్చామన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి మొదలవ్వాల్సిన పథకాన్ని.. ఎన్నికల కోడ్‌ సాకుగా చూపి చంద్రబాబు, నిమ్మగడ్డ నిలిపివేశారన్నారు. దీంతో 7,200 వాహనాలు తిరగట్లేదన్నారు. మిగతావి పట్టణ ప్రాంతాల్లో రేషన్‌ అందిస్తున్నట్టు తెలిపారు. వాస్తవమిదైతే ఎల్లో మీడియా ‘ఆగిన బండి’ అంటూ వక్రీకరించి వార్తలు రాయడం దారుణమన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందన్నారు. దీన్ని గుర్తించకుండా జనసేన, తెలుగుదేశం ఇష్టానుసారం మాట్లాడటం రాజకీయ లబ్ధి కోసమేనన్నారు. ‘‘బీరాలు పలికే పవనూ.. మా ఎంపీలంతా మీతో ఢిల్లీ వస్తారు. ఉక్కు పరిశ్రమ దక్కించే ప్రయత్నం చేస్తావా? ప్రజలను పక్కదారి పట్టించే కుయుక్తులను చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ మానుకుంటే మేలు’’ అని హితవు పలికారు.  

మరిన్ని వార్తలు