ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు

19 Nov, 2020 03:12 IST|Sakshi

ఎన్నికల పేరుతో ప్రాణాలకు ముప్పు తలపెడితే చూస్తూ ఊరుకోం: మంత్రి కొడాలి నాని

తప్పుడు మార్గంలో జరిపించేందుకు చంద్రబాబు తాపత్రయం 

గుడివాడ రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో రాష్ట్రంలో ప్రజలను చంపే ప్రయత్నం చేయవద్దని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హైదరాబాద్‌లో కూర్చుని ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారన్నారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారని చెప్పారు. ఒక్క పోలీస్‌శాఖలోనే 12 వేల మంది కరోనా బారిన పడ్డారని, ఎన్నికల విధుల్లో పాల్గొనే రెవెన్యూ, విద్యాశాఖలో వేల మందికి వైరస్‌ సోకిందన్నారు. వీరిలో చాలా మంది అనారోగ్య సమస్యలతో విధులకు దూరంగా ఉన్నారని తెలిపారు. 

బ్యాలెట్‌తో మరింత ముప్పు..: వచ్చే ఏడాది మార్చిలో నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను తప్పుడు మార్గంలో నిర్వహించి ఉనికి చాటుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాజకీయ పార్టీల ముసుగులో ఉంటున్న నిమ్మగడ్డ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయనకు రాజ్యాంగ వ్యవస్థలు, ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. నిమ్మగడ్డ చెబుతున్నట్లుగా బ్యాలెట్‌ విధానంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తే వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో రెండు మూడు కేసులు ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసిన నిమ్మగడ్డ ప్రస్తుతం వెయ్యి నుంచి 1,500 వరకు కేసులు నమోదవుతుంటే ఎన్నికలు నిర్వహిస్తామని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. అధికారులు కూడా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేరని, దీనిపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పామని నాని తెలిపారు.   

మరిన్ని వార్తలు