అవసరమైతే చంద్రబాబును అరెస్ట్‌ చేస్తారు

17 Mar, 2021 04:25 IST|Sakshi

దళితుల్ని మోసగించిన బాబు 

చట్టం ముందు తలవంచక తప్పదు 

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని  

గుడివాడ టౌన్‌: అమరావతి దళితులను మోసగించి చంద్రబాబు అండ్‌ కో భారీ కుంభకోణానికి పాల్పడిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేయడంపై మంగళవారం ఆయన స్పందిస్తూ.. అవసరమైతే సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్‌ చేసి కోర్టుకు కూడా పంపుతారని మంత్రి నాని స్పష్టం చేశారు. తనకు తానే సీఆర్‌డీఏ చైర్మన్‌గా ప్రకటించుకున్న చంద్రబాబు ఇష్టానుసారం జీవోలు విడుదల చేసి, దళితులను మోసం చేసి రూ.500 కోట్లకు పైగా సొమ్ము కాజేశారని తెలిపారు.

అమరావతిలోనే వస్తుందనే విషయాన్ని చంద్రబాబు అనుచరులు ముందే తెలుసుకుని అక్కడి దళితులను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. రాజధాని కోసం అసైన్డ్‌ భూములను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుందని భయపెట్టి దళితుల నుంచి 500 ఎకరాలను కారుచౌకగా కొట్టేసి ప్రభుత్వానికి అధిక ధరకు అమ్మారని గుర్తు చేశారు. వాస్తవానికి అసైన్డ్‌ భూములను అనుభవించడమే తప్ప అమ్మకాలు, కొనుగోలు చేయరాదన్నారు. ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే దళితుల భూములు కాజేశారన్నారు.

అచ్చెన్నాయుడు, బుద్దా వెంకన్నలాంటి కుక్కలు ఎంత మొరిగినా తమను గెలిపించిన దళితులకు న్యాయం చేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం దళితులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తుందని, ఇందులో భాగంగా చంద్రబాబుకు నోటీసులు జారీ అయ్యాయని చెప్పారు. చంద్రబాబు, ఆయనకు సహకరించిన మాజీ మంత్రి నారాయణ, ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం తప్పు లేదన్నారు.  

మరిన్ని వార్తలు