బాబు అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు నమ్మరు

31 Mar, 2021 04:33 IST|Sakshi

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జరిపే అర్హత ఆయనకు ఏమాత్రం లేదు

కరోనా కష్టకాలంలో సీఎం తమను ఆదుకున్నారన్న కృతజ్ఞత పేదలకు ఉంది

పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని

సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్పులు తెచ్చి మరీ పేదలను ఆదుకున్నారని, ఆ కృతజ్ఞత పేదలకు ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ప్రతి నిరుపేద కుటుంబానికి నేరుగా డబ్బులిచ్చారని, వారి ఖాతాల్లో నగదు జమ చేసి ఆకలి తీర్చారని గుర్తు చేశారు. దీన్ని దుబారా అని టీడీపీ విమర్శించడం శోచనీయమన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. మానవత్వం ఉన్న జగన్‌ సీఎంగా ఉన్నందుకు ప్రజలంతా ఆనందిస్తున్నారన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జరిగిన తీరు పగటి వేషగాళ్ల డ్రామాను తలపించిందని ఎద్దేవా చేశారు. పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆయన పటానికే దండేయడం సిగ్గుచేటన్నారు.

ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్‌ అంటే.. తనకు ఓటేయలేదని ఆ ప్రజలనే ఇష్టానుసారం దూషించిన నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జరిపే అర్హత చంద్రబాబుకు ఏమాత్రం లేదన్నారు. టీడీపీ ఆయన చేతిలో ఖూనీ అయిందన్నారు. ప్రజలను అవమానించే దిగజారుడు నేతగా చంద్రబాబు కీర్తికెక్కారని ఎద్దేవా చేశారు. 

లోకేశ్‌ను ఓడించారనే ప్రజలపై దూషణలు
పప్పుసుద్దయిన లోకేష్‌ను ఓడించారన్న అక్కసుతోనే చంద్రబాబు ప్రజలను దూషిస్తున్నారని ధ్వజమెత్తారు. కుల సంఘాలు, ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని ప్రజలను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగే హక్కు ఆయనకు లేనే లేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ అప్పులు తెచ్చి ప్రజలకు పంచి పెడుతున్నారని ఆరోççపిస్తున్నవారు.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.3.60 లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో తమ పార్టీ 5 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

>
మరిన్ని వార్తలు