ఎవరి సినిమాకైనా ఒకే విధానం 

28 Feb, 2022 04:33 IST|Sakshi

అఖండ, పుష్ప, బంగార్రాజు నిబంధనలే భీమ్లానాయక్‌కు..  

పవన్‌ సినిమాను తొక్కేస్తున్నారంటూ చంద్రబాబు, ఓ వర్గం మీడియా దుష్ప్రచారం: మంత్రి కొడాలి నాని

కొత్త జీవో ఫిబ్రవరి 23న ఇస్తామని ఎవరు చెప్పారు?

బాబును సీఎం చేయాలని ఆరాటపడేవారే పవన్‌ శ్రేయోభిలాషులా?

చిరంజీవిని సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో గౌరవించారు

బాబు మాయలో పడి సోదరుడిని పవన్‌ కించపరచడం తగదు 

ఎన్టీఆర్‌ వారసులను తొక్కేశారు.. రాజకీయాల కోసం వాడుకుని వదిలేశారు

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎవరి సినిమాకైనా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒకే విధానాన్ని అమలు చేస్తారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) స్పష్టం చేశారు. సీఎం జగ న్‌ మిత్రుడు నాగార్జున నటించిన బంగార్రాజు, పుష్ప, అఖండ సినిమాలకు వర్తింపజేసిన నిబంధనలనే భీమ్లా నాయక్‌కు అమలు చేస్తున్నామన్నారు. చంద్రబాబు, రామోజీరావు, లింగమనేని రమేష్‌ లాంటి తోడేళ్ల ఉచ్చులో ఇరుక్కుని చిరంజీవిని త క్కువ చేసేలా వ్యవహరించవద్దని పవన్‌ కల్యాణ్‌కు హితవు పలికారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 50 శాతానికిపైగా ఓ ట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను సా ధించారని, 2024లోనూ ఒంటరిగానే బరిలోకి దిగి రికార్డు విజయాన్ని సాధిస్తారని స్పష్టం చేశారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని  మాట్లాడారు. 

జనం జేబులు గుల్ల
సినిమా టికెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచి విక్రయిస్తుంటే చంద్రబాబు హయాంలో కమిటీని నియమించకుండా కళ్లు మూసుకుని కూర్చున్నారు. ఫిబ్రవరి 23న జీవో ఇస్తామని, పవన్‌ సినిమా విడుదల చేసుకోవాలని మేం చెప్పలేదు. సీఎం జగన్‌ సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకుంటారు. భీమ్లా నాయక్‌ సినిమాను తొక్కేస్తున్నారంటూ చంద్రబాబు, ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. వివాదాలకు తావు లేకుండా జీవో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో కొంత ఆలస్యమవుతోంది. పవన్‌ కళ్యాణ్‌కు ఇప్పటికే రెమ్యూనరేషన్‌ అందింది. సినిమా వల్ల నష్టపోతే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లే నష్టపోతారు. బ్లాక్‌లో టికెట్ల విక్రయాలు, ప్రజలను లూటీ చేయడాన్ని ఒప్పుకోం.  

నమ్మితే మళ్లీ మోసగిస్తారు... 
చంద్రబాబు సీఎం కావాలని ఆరాటపడే కొందరు వ్యక్తులు పవన్‌ కళ్యాణ్‌ శ్రేయోభిలాషులుగా నటిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు. వారిని నమ్ముకుని ముందుకు పోతే 2024లో కూడా చంద్రబాబు మోసం చేస్తారు. మీరు ఓడిపోయే 25 లేదంటే 30 సీట్లు ఇస్తారు. చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే. ఎన్టీఆర్‌ వారసులను తొక్కేశారు. స్వార్థ రాజకీయాల కోసం వాడుకుని వదిలేశారు.

చిరంజీవిని సీఎం జగన్‌ గౌరవించారు.. 
చిరంజీవి తన ఇంట్లో పనివాళ్లు మొదలుకుని పరిశ్రమలో అందరినీ గౌరవిస్తారు. చివరకు తన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ వచ్చినా లేచి రిసీవ్‌ చేసుకుంటారు. ఆయన్ను సీఎం జగన్‌ అవమానించినట్లు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోంది. సీఎం జగన్‌కు తన అన్న చిరంజీవి వంగి వంగి నమస్కారం పెట్టారని పవన్‌ కళ్యాణ్‌ అనడం హేయం. సీఎం జగన్‌ ఇంటి గుమ్మం వద్ద నిలుచుని చిరంజీవిని సాదరంగా ఆహ్వానించారు. చిరంజీవితో కలసి భోజనం చేశారు. భారతమ్మ స్వయంగా వడ్డించారని చిరంజీవే చెప్పారు. చంద్రబాబు లాంటి తోడేళ్ల మాయలో పడి చిరంజీవిని తక్కువ చేయొద్దు.  

చిక్కుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలా? 
చంద్రబాబు ఓ 420.. సీపీఐ నారాయణ ఓ వింత జంతువు. వైఎస్‌ వివేకా హత్యలో సీఎం జగన్‌ కుటుంబం ప్రమేయముందని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుని అవస్థలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పడం ఆయన మతిస్థిమితం కోల్పోయారనేందుకు నిదర్శనం.

భారతి సిమెంట్‌.. హెరిటేజ్‌పై చర్చకు సిద్ధమా?
సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్లు, నాడు–నేడు ద్వారా పాఠశాలలు, ఆసుపత్రుల ఆధునికీకరణ తదితరాలకు రూ.235కే బ్యాగ్‌ చొప్పున కొన్ని లక్షల టన్నులను భారతి సిమెంట్‌ సంస్థ సరఫరా చేసింది. చంద్రబాబు ఏ రోజైనా హెరిటేజ్‌ ద్వారా ఒక్క రూపాయైనా తక్కువకు సరఫరా చేశారా? చంద్రన్న కానుక పేరుతో నాసిరకం నెయ్యిని అంటగట్టి కమీషన్లు వసూలు చేసుకున్న ఘనత ఆయనదే. ఈ అంశంపై చర్చకు సిద్ధమా? రాష్ట్రంలో బీజేపీ నేతలు టీడీపీ బీ–టీమ్‌లా వ్యవహరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు