కల్తీకి బ్రాండ్‌ అంబాసిడర్‌.. బాబు 

30 Jun, 2022 03:48 IST|Sakshi

టీడీపీ ఒక కల్తీ పార్టీ  

బాబొక కల్తీ నాయకుడు, నాయుడు 

కుట్రలు, కుతంత్రాలతో ఆయనకు ఒళ్లంతా కుళ్లిపోయింది 

విషం ఎక్కడో లేదు.. బాబు బుర్రలోనే ఉంది 

అలాగే ఎల్లో మీడియాలోనూ ఉంది 

హెరిటేజ్‌ పాలల్లోనూ విషమే 

మాజీ మంత్రి కొడాలి నాని ధ్వజం 

సాక్షి, అమరావతి: టీడీపీ ఒక కల్తీ పార్టీ అని, కల్తీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజమెత్తారు. కుళ్లు,  కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు ఒళ్లంతా కుళ్లిపోయిందని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఒక కల్తీ నాయుడు, నాయకుడని నిప్పులు చెరిగారు. ఆయనవి కల్తీ మాటలన్నారు. ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన టీడీపీని చంద్రబాబు తన పార్టీ అని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషం ఎక్కడో లేదని, చంద్రబాబు బుర్రలోనే విషం ఉందన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ విధంగా సీఎం వైఎస్‌ జగన్‌ను తిట్టాలి? ఆయనపై ఎలా వ్యతిరేకత తేవాలి? ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజల్లో అప్రతిష్ట పాల్జేయాలి? అని ఎల్లో మీడియా నిరంతరం కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. అలాగే చంద్రబాబును దొడ్డిదారిన తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రభుత్వంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అదే పనిగా విషం కక్కుతున్నాయి..  
ముఖ్యంగా రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు, దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ వీరిదంతా ఒకే స్టాండ్‌. ఎల్లో మీడియాలో అదే పనిగా ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేశారు. రథాలు తగలబెట్టారు.. విగ్రహాలు పగలగొట్టారు.. ఆలయాల్లో ఆభరణాలు దొంగిలించారు. వీటన్నింటిపైనా పెద్ద ఎత్తున విష  ప్రచారం చేశారు.

సీఎం జగన్‌ క్రిస్టియన్‌ అని.. హిందువులకు భద్రత లేదని విషం చిమ్మారు. అరాచకాలు సృష్టించాలని చాలా ప్రయత్నించారు. ఆ తర్వాత కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెడితే.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగలబెట్టారు. తద్వారా రాష్ట్రాన్ని రావణకాష్టం చేయాలని చూశారు. ఎల్లో మీడియా పత్రికలు చదవద్దు.. ఆ టీవీలను ఎవరూ చూడొద్దు.  

లోకేష్‌వి శవ రాజకీయాలు 
నారా లోకేష్‌ ఎక్కడ ఎవరు చనిపోయినా అతడు టీడీపీ కార్యకర్త అంటున్నారు. చనిపోయిన వ్యక్తి హత్య కేసుల్లో నిందితుడైనా, రౌడీషీటర్‌ అయినా సరే.. అక్కడికి పోవడం, దండలు వేయడం చేస్తున్నారు. మా కార్యకర్తను చంపేశారని చెప్పి, శవాన్ని పట్టుకుని ఊరేగుతున్నారు. చంద్రబాబు, లోకేష్‌ ఇవే చేస్తున్నారు. ఇన్ని చేసినా ప్రజలు వారిని నమ్మడం లేదు. 

విజయసాయిరెడ్డి వియ్యంకుడి కంపెనీ అనే అక్కసు.. 
అరబిందో ఫార్మాపైనా టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి వియ్యంకుడి కంపెనీ అనే అక్కసుతోనే ఆ కంపెనీ మందుల్లో విషం ఉందంటూ చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఆ కంపెనీలో సీఎం జగన్‌ బినామీ అంటూ నిందలు వేస్తున్నారు. తద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసే కుతంత్రానికి చంద్రబాబు పాల్పడుతున్నారు. నిజానికి ఆ కంపెనీ ఎప్పుడు పెట్టారు? ఆ కంపెనీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 24 తయారీ యూనిట్లు ఉన్నాయి. అరబిందో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ మందులు అమ్ముతోంది.   

చంద్రబాబు హెరిటేజ్‌లో విషం లేదా? 
నిజానికి హెరిటేజ్‌ కంపెనీ గురించి తాము ఎన్నిసార్లు సీఎం జగన్‌ వద్ద ప్రస్తావించినా.. పోనీయండి.. వారి గురించి మనకు ఎందుకనేవారు. ఇదే హెరిటేజ్‌ పాలను కేరళ, తమిళనాడుల్లో 2012లో నిషేధించారు. అది వాస్తవమా? కాదా? ధైర్యం ఉంటే చెప్పాలి. అవి తాగితే జబ్బులు వస్తాయని నిషేధించారు. అసలు చిన్న పిల్లలు తాగే పాలలో విషం కలపడానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలి కదా! ఆయన రూ.10 కోట్లతో హెరిటేజ్‌ కంపెనీ పెడితే.. అది రూ.10 వేల కోట్లు అయ్యిందంట. దానికన్నా దౌర్భాగ్య కంపెనీ మరేదీ దేశంలో లేదు. కల్తీ పాలు, కల్తీ పెరుగు. తన బ్లాక్‌మనీ వైట్‌ చేసుకోవడానికే చంద్రబాబు హెరిటేజ్‌ కంపెనీ పెట్టారు.  

హానికరమని మద్యం బాటిల్‌పైనే ఉంటుంది  
విషం అనేది కల్తీ మద్యంలో ఉండదు. మద్యంలో అసలే ఉండదు. నిజానికి మద్యం బాటిల్‌ మీదే అది తాగితే ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. దానికి పనికిమాలిన చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ ల్యాబ్‌లకు వెళ్లడం ఏమిటి? చెక్‌ చేయించడం ఏమిటి? మద్యం ఎక్కువ తాగితే త్వరగా పోతారు. తక్కువ తాగితే లేటుగా పోతారు. దానికి ఏం చేస్తాం? సిగరెట్‌ పెట్టె మీద కూడా ఉంటుంది.. అది తాగితే హానికరమని.

గోబెల్స్‌ ప్రచారానికి తాత చంద్రబాబు. మద్యంపై ఏ ల్యాబ్‌లో టెస్ట్‌ చేయించారు?.. టీడీపీ ఆఫీస్‌లోనా?. ఎక్కడైనా మద్యం సేకరిస్తే.. వాటి శాంపిల్‌ను, ప్రతి లోడులో కొన్ని బాటిళ్లు ర్యాండమ్‌గా తీసి చెక్‌ చేశాకే గోదాముకు పంపిస్తారు. మరి వీరు ఎక్కడ బాటిళ్లు చెక్‌ చేశారు?.. టీడీపీ నేతలు సగం తాగి వదిలిన బాటిళ్లు తీసి చెక్‌ చేశారా?.. ఇదంతా ఒక వ్యూహాత్మక కుతంత్రం. 

మరిన్ని వార్తలు