నాడు ఎన్టీఆర్‌ ఉసురుతీసి ఇప్పుడు దండలేస్తావా!

19 Jan, 2021 04:13 IST|Sakshi

పిల్లనిచ్చిన మామనే రోడ్డుకీడ్చిన నీచుడివి నువ్వు

వర్ధంతి రోజే ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ గుర్తొస్తుందా 

ఢిల్లీలో చక్రం తిప్పినప్పుడు, బీజేపీతో అంటకాగినప్పుడు గుర్తులేదా?

చంద్రబాబుపై మంత్రి కొడాలి ధ్వజం 

మతం పేరుతో రాజకీయాలు మానుకో

ఆలయాలపై దాడుల కథ నిగ్గు తేలుస్తాం..

సాక్షి, అమరావతి: దివంగత నేత ఎన్టీ రామారావు పేరు కూడా ఉచ్ఛరించే కనీస అర్హత కూడా చంద్రబాబుకు లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. పిల్లనిచ్చిన పాపానికి మామకే వెన్నుపోటు పొడిచి, ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్‌ అసాధారణ స్థాయికి ఎదిగి.. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. మంత్రి నాని ఇంకా ఏమన్నారంటే..

అఖిలప్రియ అరెస్టుపై మాట్లాడవేం!
కిడ్నాప్‌ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి  అఖిలప్రియను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి పది రోజులైనా చంద్రబాబు, ఆయన కొడుకు, ఆ పార్టీ నేతలకు మాట్లాడే దమ్మే లేదు. ఆమె ఏపీలో అరెస్టయి ఉంటే ఇదే చంద్రబాబు నట విశ్వరూపం చూపించేవాడు. ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తి ఇంకెవరైనా ఉంటారా? 

డీజీపీని ఎందుకు బెదిరిస్తున్నారు? 
ఊరికి దూరంగా.. సీసీ కెమెరాలు లేని.. దేవదాయ శాఖకు సంబంధం లేని గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేస్తే చంద్రబాబు నానా రభస చేస్తాడు. జగన్‌మోహన్‌రెడ్డి, డీజీపీ, హోంమంత్రి అంతా క్రిస్టియన్లు అంటాడు. 9 ఆలయాల్లో ఘటనలతో టీడీపీ, బీజేపీకి చెందిన వారికి సంబంధం ఉందని చెబితే డీజీపీని బెదిరిస్తారా? 80 గుళ్లపై జరిగిన దాడిలో వాళ్ల ప్రమేయం ఉందని డీజీపీ చెప్పలేదే. డీజీపీని బెదిరించడం వెనుక అసలు కథ వేరు. చంద్రబాబు హయాంలో కాల్‌మనీ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడున్న డీజీపీ అప్పట్లో విజయవాడ నగర సీపీ. కాల్‌మనీ కేసులో టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల ప్రమేయం ఉందని తేల్చాడు. వాళ్ల పేర్లు బయటపెట్టొద్దని డీజీపీపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చాడు. వినలేదని ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. సీనియారిటీ ఉన్నా డీజీపీ పోస్టు ఇవ్వలేదు. తమ ప్రభుత్వం ఆయన అర్హతలను గుర్తించి ఉన్నత స్థానం కల్పిస్తే చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడు. 

చంపేసి.. దండేస్తావా బాబూ!
ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీనే లాక్కుని, ఆయననే సస్పెండ్‌ చేసి, ముఖ్యమంత్రి పదవినీ లాక్కున్న దొంగవు నువ్వు. నువ్విప్పుడు ఆయన విగ్రహాలకు దండలేయడం, ఎన్టీఆర్‌ గురించి గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎన్టీఆర్‌ వర్ధంతి రోజునో.. జయంతి రోజునో ఆయనకు భారతరత్న ఇవ్వాలంటావు. ఢిల్లీలో చక్రాలు తిప్పానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అప్పుడేం చేశాడు. ఎందుకు అప్పుడే భారతరత్న ఇప్పించలేదు. వాజ్‌పేయితో ఐదేళ్లు, నరేంద్రమోదీతో మరో ఐదేళ్లు అంటకాగినప్పుడు భారతరత్న విషయం గుర్తుకు రాలేదా? మోసం, దగా, వంచన తెలిసిన చంద్రబాబుకు ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలి.

ప్రజలంతా జగన్‌ వైపే..
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు, అగ్రవర్ణ పేదలతోపాటు 80 శాతం ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలను అందిస్తుండటంతో వారంతా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. అందుకే చంద్రబాబు కుట్రపన్ని గుళ్లను కూల్చి మొసలి కన్నీరు కార్చే నీచ రాజకీయాలు చేస్తున్నాడు. విద్వేషాల వెనుక ఎవరున్నా చొక్కా పట్టుకుని బయటకు తీసుకొస్తాం. మతాలను అడ్డుపెట్టుకుని బతకాల్సిన అవసరం వైఎస్సార్‌సీపీకి లేదు. వైఎస్‌ జగన్‌ మానవతావాది. గుడికెళ్లినా, మసీదుకెళ్లినా, చర్చికెళ్లినా ఆ సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి జగన్‌. ఓట్లకోసం చంద్రబాబు చేసే చిల్లర రాజకీయాలు ప్రజలు నమ్మొద్దు. మతమే అజెండాగా పనిచేసే బీజేపీ ఆటలు ఈ రాష్ట్రంలో ఎంతమాత్రం సాగవు. 

మరిన్ని వార్తలు