పవన్‌ ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు

1 Oct, 2021 03:39 IST|Sakshi

మంత్రి కొడాలి నాని మండిపాటు

సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా కూడా గెలవలేడని.. రాజకీయ పార్టీ పెట్టి, పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయిన అరుదైన ఘనత దేశంలో ఇతనికే దక్కుతుందని మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఎద్దేవా చేశారు. గురువారం ఆయన సచివాలయం ప్రాంగణంలో విలేకర్లతో మాట్లాడారు. పరిషత్‌ ఎన్నికల్లో కనీసం పోటీ కూడా ఇవ్వలేని జనసేనాని యుద్ధానికి సిద్ధం.. జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని చేస్తా.. అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్‌కు జీవిత కాలం సమయం ఇస్తానని, జగన్‌ను మాజీ సీఎం చేయగలిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. 2024 ఎన్నికల్లో పార్ట్‌నర్‌ చంద్రబాబునాయుడు, బీజేపీ, కాంగ్రెస్‌.. అవసరమైతే ఇంతకు ముందు జతకట్టి వదిలేసిన కమ్యూనిస్టులను సైతం కలుపుకుని పోటీ చేసినా, పవన్‌ ఎమ్మెల్యేగా కూడా గెలవలేడన్నారు. 

ఇన్నాళ్లు ఏం చేసినట్లు?
మాయావతి పార్టీ దగ్గరకు వెళ్లి ఎస్సీ, ఎస్టీ ఓట్లు చీల్చేందుకు కాళ్లు పట్టుకున్న నీచ చరిత్ర పవన్‌ది అని మంత్రి నాని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి చాలెంజ్‌ చేసే అర్హత చవట, దద్దమ్మ పవన్‌కు లేదన్నారు. ఇప్పటి వరకు రాజకీయాలు చేయకుండా చంద్రబాబు, మోదీ బూట్లు నాకే కార్యక్రమం పెట్టుకున్నానని, ఇకపై రాజకీయాలు చేయాలనుకుంటున్నానని చెప్పుకునే దయనీయ పరిస్థితుల్లో పవన్‌ ఉన్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌కు, వైఎస్సార్‌ సీపీ నాయకులకు భయం ఏంటో తెలీదన్నారు. తమ నాయకుడు ఒంటరిగా ఢిల్లీని ఎదురించి, పోరాడి గెలిచాడని గుర్తు చేశారు. పవన్‌ తమను భయపెట్టడానికి తన అట్టర్‌ ప్లాప్‌ జానీ సినిమాలు చూపిస్తాడా? అని ప్రశ్నించారు. అప్పగించిన స్క్రిప్ట్‌ సరిగా చదవలేదని చంద్రబాబు, ఆయన అభిమానులే భయపడతారని ఎద్దేవా చేశారు.    

మరిన్ని వార్తలు