చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని సవాల్‌

16 Nov, 2020 12:30 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: ‘‘గుడివాడలో 17 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇస్తాం. మహిళలు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. అలా జరగని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయను’’ అని పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని అన్నారు. తనపై ఎల్లో మీడియాలో పిచ్చిరాతలు రాస్తున్నారని, తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తారా అంటూ సవాల్‌ విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో ప్రజల కోసం చేసిందేమీ లేదని, అందుకే ప్రజా సంక్షేమానికై పాటుపడుతున్న ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వెన్నుపోటుకు మారుపేరైన బాబు మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా మార్కెట్ యార్డులో టిడ్కో లబ్ధిదారులతో సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. మార్కెట్ యార్డు నుంచి మల్లాయి పాలెం టిడ్కో ఇళ్ల సముదాయాల వరకు మంత్రి కొడాలి నాని ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వహించారు.(చదవండి: సీఎం జగన్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి నాని)

8 వేల మందికి సెంటు స్థలం ఇస్తాం
ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని, వాస్తవ పరిస్థితులను ప్రజల కళ్లకు కట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.  ‘‘గుడివాడ గడ్డపై నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇక్కడ ఇళ్ళు లేని పేదలు ఎంతో మంది ఉన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు హడావుడిగా శంఖుస్థాపన చేశారు. అంతేతప్ప వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. చిన్న వర్షం కురిస్తే చాలు.. ఇళ్ల సముదాయాల వరకు వెళ్ళలేని దుస్థితి. అందుకే అర్హులందరికీ లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతో ఇళ్ల స్థలాల కోసం 94 కోట్ల తో 181 ఎకరాలు తీసుకున్నాం. 8 వేల మందికి సెంటు స్టలం ఇస్తాము. టిడ్కో లబ్ధిదారుల దగ్గర డబ్బులు బాబు కట్టించుకున్నారు. వాటిని వేరే అవసరాల కోసం వాడుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు.

చంద్రబాబు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇళ్ళు ఇవ్వకపోగా శకునిలా అన్నింటికీ అడ్డుపడుతున్నారు. బాబు అండ్‌ కో బ్యాచ్‌కి కులగజ్జి పట్టుకుంది. తమ కులస్తుడు చంద్రబాబే ముఖ్యమంత్రి ఉండాలని కొందరు కోరుకుంటున్నారు. ఇతర కులస్తులు ముఖ్యమంత్రిగా  ఉంటే ఓర్వలేక పోతున్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్రలు చేస్తున్నారు. డబ్బా ఛానెల్స్ లో పనికిమాలిన చర్చలు పెడుతున్నారు. పచ్చమీడియాలో పిచ్చి రాతలు రాయించి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. నాకు వ్యాపారాలు లేవు. నేను బతికున్నంత వరకు ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తాను. 2024 ఎన్నికల నాటికి ఇళ్ళు ఇవ్వకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను’’ అని కొడాలి నాని ఎల్లో మీడియా తీరును ఎండగట్టారు.

చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా..
‘‘ఎన్ని ఇళ్ళు కట్టించావో చెప్పు. కొడాలి నాని అవినీతి కి పాల్పడ్డాడని నిరూపిస్తే ఉరివేసుకోవడానికి సిద్ధం. చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నా. టిడ్కో ఇళ్ల వద్ద వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రారంభోత్సవం చేయిస్తా. రాష్ట్రానికి శనిలా పట్టిన చంద్రబాబు కాకిలా కలకాలం ఉంటారు. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతారు. వెన్నుపోటు సంస్కృతి ఆయనకే సొంతం. ఇప్పుడేమో ఇతర పార్టీల్లో చీలికలు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు’’ అంటూ చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు.
 

మరిన్ని వార్తలు