అందుకే చంద్రబాబుకు ఏడుపు: కొడాలి నాని

14 Dec, 2023 14:14 IST|Sakshi

సాక్షి, కృష్ణాజిల్లా: ఆగి ఉన్న లారీ కింద దూరిన కుక్క.. ఆ లారీని తానే మోస్తున్నానని అనుకుంటుందని, లారీ కింద దూరిన కుక్కకి టీడీపీ నేతలకు తేడా లేదంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ.. రేవంత్‌రెడ్డిని వీళ్లే సీఎం చేసినట్లు ఫీల్‌ అవుతున్నారని, సిగ్గులేకుండా గాంధీ భవన్‌లో టీడీపీ జెండాలు పట్టుకుని గంతులేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కూడా చంద్రబాబు శిష్యుడే కదా, ఒక శిష్యుడు దిగిపోయి మరొక శిష్యుడు పదవిలోకి వచ్చాడని చెప్పారు. తన శిష్యులు సీఎంలు అవుతున్నారని చంద్రబాబు వెక్కివెక్కి ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రజలను పట్టించుకోకుండా హెరిటేజ్, ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే పట్టించుకున్నాడని ఫైర్‌ అయ్యారు.

కోటాను కోట్లు దోచుకుంటాడు కాబట్టే చంద్రబాబు వంటి పనికిరాని వాళ్లు చిత్తుచిత్తుగా ఓడిపోయారని గుర్తుచేశారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యతిరేకత ఉంటుందా? లేదా చంద్రబాబు దొంగ 420 అయినందుకు అనుకూలత ఉంటుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి రావడం పగటికల అని అన్నారు.

తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీచేస్తే జనసేన పరిస్థితి ఏమైందో మనం చూశామని చెప్పారు. ఏపీలో చంద్రబాబుతో కలిసి జనసేన పోటీచేస్తే.. తెలంగాణ మాదిరిగానే అవుతుందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం కోసమే చంద్రబాబు.. అసెంబ్లీలో అధ్యక్షా అనడం కోసం పవన్ కళ్యాణ్ పొత్తుపెట్టుకున్నారని మండిపడ్డారు. గుడివాడ వైఎస్సార్‌సీపీకి కంచుకోట అని, తాను బతికుండగా గుడివాడ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా దించడం ఎవరివల్లా కాదని అన్నారు.

ఈ వార్త కూడా చదవండి: సామాజిక జైత్ర యాత్ర.. హోరెత్తిన మడకశిర

>
మరిన్ని వార్తలు