గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరపాలి

13 Feb, 2024 01:47 IST|Sakshi

హెచ్‌ఎండీఏలో ఉద్యోగిని పట్టుకుంటే పెద్దోళ్లు బయటకు వస్తున్నారు

ఈ అవినీతిలో ఎవరున్నారో బయటపెట్టాలి: కోదండరెడ్డి

ప్రతిపక్ష నేతను సభకు రమ్మని అడగాల్సిన దుస్థితి: జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్రమాలపై విచారణ జరపాలని ఏఐసీసీ కిసాన్‌సెల్‌ వైస్‌చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిసారీ చేసింది కాంగ్రెస్‌ నేతలయితే, కేసీఆర్‌ కుటుంబం సెంటిమెంట్‌ను వాడుకుని రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ నాగరిగారి ప్రీతం, ఫిషర్‌మెన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌లతో కలిసి ఆయన మాట్లాడుతూ, హెచ్‌ఎండీఏలో ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ పట్టుకుంటే పెద్దోళ్లు బయటకు వస్తున్నారని అన్నారు.

ఈ శాఖను కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ నిర్వహించిన నేపథ్యంలో ఈ అవినీతిలో ఎవరెవరు ఉన్నారన్నది బట్టబయలు చేయాలని కోరారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన చరిత్ర తమదని, తెలంగాణ రైతాంగానికి కూడా రుణమాఫీ చేస్తామని, రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. 

నాడు పోపో అంటే...
నేడు రా.. రా అంటున్నారు: జగ్గారెడ్డి 
ధరణి పోర్టల్‌ లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, రైతులకు ఉపయోగపడని ధరణిని రద్దు చేయాలని రాహుల్‌గాం«దీనే చెప్పారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్ల తర్వాత అసెంబ్లీలో మూడున్నర గంటలపాటు చర్చ జరిగిందని, అసెంబ్లీలో ఏం జరుగుతోందన్నది తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోందన్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిని పోపో అని నోరు మూసేవారని, ఇప్పుడు సీఎం రేవంత్‌ మాత్రం రా..రా.. అంటున్నా ప్రతిపక్ష నేత సభకు రావడం లేదని ఎద్దేవా చేశారు. అధికారం ఇవ్వకపోతే కేసీఆర్‌ అసెంబ్లీకి రాడా అని ప్రశ్నించారు. ప్రజలిచ్చిన తీర్పును కేసీఆర్‌ అవమానపరుస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు