టీఆర్‌ఎస్‌ నేతల వద్ద పట్టభద్రుల సర్టిఫికెట్లు

30 Sep, 2020 05:30 IST|Sakshi

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఆరోపణ  

ఒకటి, రెండ్రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడి 

హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని టీజేఎస్‌ అధ్యక్షుడు  ఎం.కోదండరాం అన్నారు. అభ్యర్థులను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. హన్మకొండలో మంగళవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు  అడ్డదారులు వెతుక్కుంటున్నారని, అందులో భాగంగా పట్టభద్రుల సర్టిఫికెట్లను జమ చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ విషయంలో తామేమీ భయపడటం లేదన్నారు. వేలాది మంది ప్రైవేట్‌ టీచర్లు తమకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణలో రాజకీయాలు మలుపు తిప్పే సమయం ఆసన్నమైందని,, బక్కపలచని వారే మలుపు తిప్పుతారని ఉద్ఘాటించారు. పట్టభద్రులు జేఏసీలుగా ఏర్పాటు కావాలని కోదండరాం పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎన్నికల బరిలో దిగాలనుకునే వారు పునరాలోచించుకోవాలని, ఒకసారి తమకు అవకాశం కల్పించాలని కోరారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలపై భారం మోపేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకొచ్చిందని కోదండరాం విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నేతల కోసమే ప్రైవేట్‌ వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్‌లో ప్రజలు వరదలు వచ్చిన ప్రతీసారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.  

మరిన్ని వార్తలు