పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కోదండరామ్‌ 

25 Aug, 2020 03:36 IST|Sakshi

వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ నియోజకవర్గం నుంచి పోటీ 

దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ పోటీకి టీజేఎస్‌ సిద్ధం! 

పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) నిర్ణయించింది. అందులో వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ నియోజకవర్గం నుంచి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను బరిలో నిలపాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇక హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిని పోటీలో నిలపాలని నిర్ణయించింది. సోమవారం పార్టీ కార్యాలయంలో కోదండరామ్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ (పీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే దుబ్బాకలో జరగనున్న ఉప ఎన్నికలో కూడా పోటీ చేయాలని పార్టీ వర్గాలు నిర్ణయానికి వచ్చాయి.

అయితే అక్కడ అభ్యర్థిగా ఎవరిని దింపాలి.. పోటీ చేస్తే పరిస్థితి ఏంటి..? గెలుపోటముల అవకాశాలు ఎలా ఉంటాయన్న అంశంపై అధ్యయనం చేసి, నివేదిక అందజేసేందుకు ముగ్గురు సీనియర్‌ నేతలతో కమిటీ వేయాలని నిర్ణయించారు. కమిటీ నివేదిక ఆధారంగా ముందుకు సాగనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జి.వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీలో దిగేందుకు పార్టీ సీనియర్‌ నేతలు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉన్నందున ఇప్పటినుంచే పార్టీ సీనియర్లు ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.   

మరిన్ని వార్తలు