అశోక్‌ బంగ్లా వేదికగా మరో కుట్ర

26 Dec, 2022 04:15 IST|Sakshi
విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతున్న శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల

చంద్రబాబు తీరుపై డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల ధ్వజం

మానసిక స్థితి బాగోలేకే పిచ్చి మాటలు

సభలకు జనాల్ని డబ్బులిచ్చి తరలిస్తున్నారు

ఒక్కసారి గెలవని పవన్‌కు దాసోహం

సాక్షి, విశాఖపట్నం/విజయనగరం: టీడీపీ నేత అశోక్‌ గజపతిరాజు బంగ్లా నుంచే 1995లో ఎన్టీ­ఆర్‌కు వెన్ను­పోటు వ్యూహాన్ని చంద్రబాబు రచించారని, మళ్లీ ఇప్పుడు ఆ బంగ్లా వేదికగా మరో కుట్రకు తెర లేపారని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. త్వరలోనే ఆ కుట్ర బట్టబయలవుతుందని చెప్పారు. ఆదివారం ఆయన విశాఖ సర్క్యూట్‌ హౌస్‌లో, విజయ­నగరంలో మీడియాతో మాట్లా­డారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న చంద్ర­బాబుకు మానసిక స్థితి బాగోలేదన్నారు.

అనని మాటలను పట్టుకొని చంద్రబాబు ఏడవడంతోనే ఆయన మానసిక ధైర్యాన్ని కోల్పోయారని చెప్పారు. ‘బాదుడే బాదుడు’ అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో పేరు మార్చి ‘ఇదేమి ఖర్మ’ అంటూ ప్రజల్లోకి వెళ్లగా.. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఖర్మ పట్టుకుందని జనం అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు సభలకు డబ్బులిచ్చి మరీ జనాన్ని రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ వాళ్లే చర్చించుకుంటున్నారని చెప్పారు.

ఒక్కసారి కూడా గెలవని, ఒక్క సీటు లేని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు చంద్రబాబు దాసోహమయ్యా­డన్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీకి తూట్లు పొడుస్తున్నారన్నారు. బీసీలంటే ఎప్పుడూ చంద్రబాబుకు చులకన భావమేనని, బీసీ మహిళా అధ్యక్షురాలు ఫొటో దిగడానికి వస్తే.. అశోక్‌ కుమార్తె అడ్డుకుంటే చూస్తూ మిన్నకుండిపోవడం అవమానించడం కాదా అని ప్రశ్నించారు. 

కుప్పంలో మీ సంగతి చూసుకోండి
విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న తాను, మంత్రి బొత్స సత్యనారాయణ ఓడిపోతామని చెబుతున్న చంద్రబాబు.. ముందు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఎలా గెలవాలో చూసుకోవాలని కోలగట్ల హితవు పలికారు. బొబ్బిలి, రాజాం, విజయనగరం నియోజక­వర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో సైకిల్‌ పోవాలంటూ ఆయన చెప్పడం ద్వారా నిజాన్ని ఒప్పుకున్నారన్నారు.   ఎవరెన్ని కుట్రలు చేసినా విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు తథ్యమని చెప్పారు. 

మరిన్ని వార్తలు