‘స్టార్‌డమ్‌ను అడ్డుపెట్టుకొని పిచ్చిగా మాట్లాడుతున్నాడు’

30 Sep, 2021 03:24 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం వైఎస్‌ జగన్‌పై ఇష్టానుసారంగా, నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌కు పిచ్చి, ఉన్మాదం పరాకాష్టకు చేరిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఇంత దిగజారి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడి ఉండరన్నారు. స్టార్‌డమ్‌ను అడ్డుపెట్టుకొని పిచ్చిగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్‌ ప్రజాస్వామ్యంలో ఉండదగిన వ్యక్తేనా? అన్న సందేహం కలుగుతోందన్నారు. గంటకు పైగా మాట్లాడిన పవన్‌ ప్రసంగంలో ప్రశ్నలేమీ లేవని ప్రజలకు అర్థమైందన్నారు. స్టోరీ రైటర్‌ వచ్చి సినిమా కథ చెబితే ఏవిధంగా ఉంటుందో అలా ఉంది తప్పించి, ఈ రాష్ట్రానికి సంబంధించి, ఒక్క ప్రశ్న వేయలేదనే విషయం పవన్‌కు అర్థం కావడం లేదన్నారు. ఈ సమావేశంలో పార్థసారథి ఇంకా ఏమన్నారంటే..

కనీస అవగాహన కరువు
► పవన్‌కు రాష్ట్ర పరిస్థితుల మీద కనీస అవగాహన లేదు. పక్కరాష్ట్రంలో ఉంటున్నాడు. చిరంజీవి వల్ల పైకొచ్చి పవన్‌ ప్రగల్భాలు పలుకుతున్నారు. కమ్మ సామాజికవర్గం ఎట్టిపరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీకి వర్గ శత్రువు కానే కాదు. రాష్ట్రంలో లేని వర్గ శత్రువులను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలంటే కుదరదు. కొడాలి నాని, తలశిల రఘురాం లాంటి ఎందరో తన వెన్నంటే ఉన్నారని సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. వర్గ శత్రువులను చూసి సీఎం జగన్‌కు 151 సీట్లు రాలేదు.     అధిక వర్షాలు, గత ప్రభుత్వ పనితీరు వల్ల రోడ్లు పాడయ్యాయి. కేంద్రంలోని బీజేపీ నాయకత్వమే జగన్‌ పరిపాలనను మెచ్చుకుంటోంది. బీజేపీవి పాచిపోయిన లడ్డూలు అంటాడు.. ఢిల్లీ వెళ్లి ఆ లడ్డూలే మళ్లీ తింటాడు.

చదవండి:   ఎవరో ఏదో మాట్లాడితే పరిశ్రమకు సంబంధం లేదు: నిర్మాత

పవన్‌ ది ఫ్లాప్‌ షో
► అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో పవన్‌ ది ఫ్లాప్‌ షో. జన సైనికులు పవన్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారిని ఈదినట్లే.  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలు సంతోషంగా ఉన్నాయి.
► దేశంలో కరోనా కకావికలం చేస్తుంటే, ఏపీలో మాత్రం పేదలకు రూ.లక్ష కోట్లు పైబడి ఫలాలు అందాయి. పవన్‌కు ఈ విషయం కనిపించలేదా?    తుని ఘటనపై మాట్లాడటానికి పవన్‌కు సిగ్గుండాలి. అప్పటి ప్రభుత్వంలో ఆయన భాగస్వామి. ఆయన ఏం చేస్తున్నట్లు? ఓ పక్క కులం లేదంటాడు.. మళ్లీ కాపులు నా కులం అంటాడు. రాజకీయాల్లో అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడు. సినిమాల్లో తన స్టార్‌డమ్‌ను అడ్డుపెట్టుకుని పిచ్చిగా మాట్లాడుతున్నాడు. సినిమా రంగం వల్ల ఆయనకు లాభం కలిగింది కానీ, ఆ రంగానికి ఏమీ ఒరగలేదు.   

మరిన్ని వార్తలు