ఆనాడు ఆస్తులెన్ని.. ఇప్పుడెన్ని?.. మొత్తం బయటకు తీస్తా: కోమటిరెడ్డి

15 Aug, 2022 18:46 IST|Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: అసెంబ్లీలో మూడు సంవత్సరాలు నియోజకవర్గ సమస్యలపై మాట్లాడినా స్పందించని సీఎం కేసీఆర్‌ నేడు ఉప ఎన్నికల భయంతో మునుగోడులో అభివృద్ధి పనుల గురించి ఆలోచిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21న లక్ష మందితో మునుగోడులో అమిత్ షా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. అమిత్ షా మీటింగ్‌కు భయపడే, కేసీఆర్ 20వ తేదీన బహిరంగ సభ పెట్టుకున్నాడు.

నా పదవీ త్యాగంతో మునుగోడు అభివృద్ధి చెందుతుంది. మంత్రి జగదీష్ రెడ్డి నేను అమ్ముడుపోయిన అని మాట్లాడుతున్నాడు. అది ఆయన రుజువు చేస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా.. లేకపోతే నీవు మంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని సవాల్‌ విసిరారు. మంత్రి జగదీష్ రెడ్డి నాగారం, తుంగతుర్తి మర్డర్ కేసులలో A1, A2 నిందితుడిగా ఉన్నారు. నేరచరిత్ర కలిగిన మనిషి ఈ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ రాక ముందు జగదీష్ రెడ్డి ఆస్తులు ఎన్ని? ఇప్పుడున్న ఆస్తులు ఎన్ని?. మొత్తం బయటకు తీస్తా. త్వరలోనే  అక్రమాస్తుల చిట్టా బయటపెడతా. మునుగోడులో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజల తీర్పు ఉంటుంది' అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. 

చదవండి: (లా అండ్‌ ఆర్డర్‌ చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలి: బండి సంజయ్‌)

మరిన్ని వార్తలు