కేసీఆర్‌ సర్కార్‌ 15 రోజుల్లో కూలిపోతుంది.. రాజగోపాల్‌రెడ్డి

22 Oct, 2022 10:04 IST|Sakshi

మునుగోడు: మునుగోడు ఉపఎన్నికలో తాను గెలిచిన పదిహేను రోజుల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. నవంబర్‌ 3న జరిగే ఉపఎన్నికలో తాను గెలుస్తానని ప్రశాంత్‌ కిశోర్‌కు సంబంధించిన 10 సర్వే టీంమ్‌లు తేల్చి చెప్పడంతో సీఎం కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదన్నారు. అందుకే తన వంద మంది కౌరవ సైన్యాన్ని గ్రామాలకు పంపించి ఇతర పార్టీల నాయకులని బెదిరిస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. అంతేగాక, సీఎం కేసీఆర్‌ లెంకలపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడే వారం రోజుల పాటు మకాం వేసి తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు అనేక అప్రజాస్వామిక చర్యలు పాల్పడేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. 

రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం మునుగోడులో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు ఏకంగా రిటర్నింగ్‌ అధికారిని అనేక ఇబ్బందులకు గురిచేశారని, ఓ పార్టీ అభ్యర్థికి వచ్చిన రోడ్‌రోలర్‌ గుర్తును రాత్రి 3.25 గంటలకు సంతకం చేయించి మార్పించారన్నారు. అందులో ఆర్‌వో తప్పు ఏమీలేదని, అధికారంలో ఉన్నామనే అహంకారంతో అతనిపై ఒత్తిడిచేసి చేయించారని మండిపడ్డారు. మునుగోడు ఎన్నిక ఫలితం రాగానే రాష్ట్రంలో పెను మార్పులు వస్తాయని భావించిన పలు పార్టీల నాయకులు తన గెలుపునకు పరోక్షంగా మద్దతిస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. 

రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన రోజే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అయిందన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని కేవలం తనను ఓడించేందుకు మాత్రమే పాల్వాయి స్రవంతితో పోటీ చేయించారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడు అభివృద్ధికి కేంద్రమంత్రి అమిత్‌షా రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, మునుగోడు ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు.  

మరిన్ని వార్తలు