Munugode Politics: సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి

20 Aug, 2022 18:03 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: మునుగోడు బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని మండిపడ్డారు. కనీసం నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడడానికి అపాయింట్‌మెంట్‌ అడిగినా కేసీఆర్‌ ఇవ్వలేదని విమర్శించారు.

కేసీఆర్‌ మాట్లాడేవన్నీ అబద్ధాలేని.. మునుగోడు ఇచ్చే తీర్పుతో కేసీఆర్‌ దిగిపోవడం ఖాయమన్నారు. ఆయన ఎప్పుడైతే ప్రతిపక్షం లేకుండా చేశారో అప్పుడే ఆయన పతనం మొదలైందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసమే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. కేసీఆర్‌ అహంకారం వల్లే ఈ ఉప​ ఎన్నిక. ఎమ్మెల్యేలకు అపాయింట్‌ ఇవ్వడం లేదంటే అది కేసీఆర్‌ అహంకారం కాదా అని ప్రశ్నించారు. బీజేపీకి ఓటేస్తే మీటర్లు వస్తాయని అన్న కేసీఆర్‌ మాటలు అసత్యాలని అన్నారు. బీజేపీకి ఓటేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు రావని స్పష్టం చేశారు.  కేసీఆర్‌ తన ప్రాభవం కోసం ఎప్పటికప్పుడు బీజేపీపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్‌ మునుగోడు బహిరంగ సభలో బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీకి ఓటేస్తే బాయికాడ మీటరొస్తది అన్న సీఎం కేసీఆర్‌.. ఆ పార్టీని తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. అయితే మరో ఏడాదిలో ఎన్నికలు ఉంటే ఇప్పుడు రాజగోపాల్‌ రెడ్డి ఎవరి కోసం రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోతున్నాడని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఢిల్లీలో మా నీళ్ల సంగతేంటని రాజగోపాల్‌రెడ్డి ఎందుకు అడగరని  నిలదీశారు.

చదవండి: (ఈడీ, బోడీలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో: సీఎం కేసీఆర్‌)

మరిన్ని వార్తలు