బీజేపీలోకి చేరుతున్నా.. డేట్‌ ఫిక్స్‌ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి..

6 Aug, 2022 13:19 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఈ నెల 21న అధికారంగా బీజేపీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన ఢిల్లీలో బీజేపీ చీఫ్‌ నడ్డా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌లను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చౌటుప్పల్‌లో బహిరంగ సభ ఉండే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేశానన్నారు.
చదవండి: పార్టీలో చేరికలపై ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు 

కాంగ్రెస్‌ పార్టీ సహకరించపోయినా కష్టపడ్డానన్నారు. ‘‘టీఆర్‌ఎస్‌లోకి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. వారిపై అధిష్టానం ఏం చర్యలు తీసుకుంది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. కాంగ్రెస్‌, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తున్నా.. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తున్నా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారడం మోసం చేయడమా? మునుగోడు అభివృద్ధికి సొంత నిధులు ఖర్చు చేశా. నా రాజీనామాతోనైనా ముఖ్యమంత్రి కళ్లు తెరవాలి. మునుగోడులో సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని’’ రాజగోపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

‘‘ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు మాపై పెత్తనం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన వెంకట్‌రెడ్డిపై అద్దంకి వ్యాఖ్యలు దారుణం. రాష్ట్రం కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి వెంకట్‌రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై చిల్లర గ్యాంగ్‌లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయి. దుర్మార్గుడి చేతుల్లోకి కాంగ్రెస్‌  వెళ్లింది. రేవంత్‌, ఆయన సైన్యం దొంగల ముఠాగా ఏర్పడింది.కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఎలాంటి అవినీతి లేదు. రేవంత్‌  స్వార్థం కోసం, పదవుల కోసం కాంగ్రెస్‌లో చేరాడు. డబ్బులు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్న చరిత్ర రేవంత్‌ది’’ అని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు