బీజేపీలో చేరికపై రాజగోపాల్‌రెడ్డి ప్రకటన.. రేవంత్‌కు సవాల్‌

5 Aug, 2022 16:44 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ మాజీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరిక ముహూర్తం ఖరారైంది. ఈనెల 21న అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు స్వయంగా ప్రకటించారు రాజగోపాల్‌ రెడ్డి. శుక్రవారం ఢిల్లీకి వెళ్లి బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రం హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. అనంతరం మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.  

‘మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కనువిప్పు కలగిస్తాం. ఈ ఉప ఎన్నికతో రాష్ట్రంలో మార్పు వస్తుంది. అమిత్‌ షా నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈనెల 21న తెలంగాణకు అమిత్‌ షా వస్తారు. అదే రోజు బీజేపీలో చేరతాను. బహిరంగ సభ పెట్టి మరీ చేరతాను.  ఈ నెల 8వ తేదీన స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తాను. బీజేపీకి అమ్ముడు పోయినట్లు రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. లేకుంటే నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా? అని రేవంత్‌కు సవాల్‌ విసిరారు రాజగోపాల్‌రెడ్డి. అంతేకాదు డబ్బులు ఇచ్చి పీసీసీ కొనుకున్నారంటూ రేవంత్‌పై ఆరోపణలు గుప్పించారు.

రేవంత్‌ భాష, వ్యవహారశైలి అందరూ అస్యహించుకుంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిని బయటకు వెళ్లగొడుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పార్టీ మారతారనే ఊహాగానాలు వస్తున్నాయి. వెంకట్‌రెడ్డి అన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా ’ అని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

ఇదీ చదవండి: హోం మంత్రి అమిత్‌ షాను విడివిడిగా కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌

మరిన్ని వార్తలు