రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై అదిష్టానం‌ సీరియస్‌ 

2 Jan, 2021 03:07 IST|Sakshi

పీసీసీ ముఖ్యులను నివేదిక కోరిన పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌

నాకే సంబంధం లేదు.. పార్టీ మారబోను: వెంకట్‌రెడ్డి 

పీసీసీ చీఫ్‌ రేసులో ఉన్న వెంకట్‌రెడ్డికి సోదరుడి తీరుతో ఇబ్బంది

సాక్షి, తిరుమల: తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు గుర్తిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఆయన వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని మొదట చెప్పిన వ్యక్తిని తానేనన్నారు. ఇందుకు నిదర్శనం దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనమని తెలిపారు.

భవిష్యత్తులో బీజేపీలో చేరనున్నట్లు వెల్లడించారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని, అన్నదమ్ములు గా కలిసే ఉన్నప్పటికీ రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వారివేనని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని కోరారు. తెలంగాణ పీసీసీ పీఠం కోసం రేవంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి ప్రయత్నిస్తున్నా ఎవరు విజయవంతమవుతారో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఆయనతో పాటు తెలంగాణ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. 

సాక్షి.హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతానన్న వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగ ణిస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని పార్టీ వర్గాలను ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయంపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోనూ మాట్లాడినట్టు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి వ్యవహా రంపై ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డితోనూ అధిష్టాన దూతలు మాట్లాడినట్టు తెలిసింది. తన సోదరుడి తీరు తనకూ అంతుచిక్కడం లేదని, అయితే ప్రస్తుత పరిణామాలకు తనకు ఎలాం టి సంబంధం లేదని వెంకట్‌రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది.

తాజాగా రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారడానికి సంబంధించి వెలిబుచ్చిన అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవేనని.. అయితే తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని వెంకట్‌రెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. గతంలోనూ రాజగోపాల్‌రెడ్డి పలు మా ర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఏకంగా అప్పటి పార్టీ ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియాపైనా సంచ లన ఆరోపణలు చేయడం వంటివి చోటుచేసుకున్న తాజా పరిణామాలను పార్టీ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. వచ్చే 3, 4 రోజుల్లోనే రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు వెల్ల డించాయి. రాజ్‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నందున ఆయనపై చర్యకు ఏఐసీసీ, అధిష్టానం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున, హై కమాండ్‌ స్పందన కోసం పార్టీ నేతలు వేచి చూస్తున్నట్టు సమాచారం. 

ఆ ఉప్పందడంతోనే పార్టీ మార్పా?
ఇటు టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం వెంకట్‌రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్న సందర్భంలో ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి ఈ విధంగా వ్యవహరించడం వెంకట్‌ రెడ్డికి నష్టం కలగజేస్తుందనే అభిప్రాయాన్ని పార్టీ నేత లు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం పార్టీని ఇరుకున పెట్టడంతో పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదిగినందున తాను ఆ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలాన్ని రేపుతున్నాయి. ప్రస్తుత వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవినిచ్చే విషయంలో ఉప్పందడంతోనే రాజగోపాల్‌రెడ్డి ఈ విధంగా స్పందిస్తున్నారా అన్న సందేహాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. 

వెళ్లినా ఆ ఒక్కడే!
ఇక ఒకవేళ రాజ్‌గోపాల్‌రెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకున్నా, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లే సీనియర్లు, ఇతర నాయకుల సంఖ్య పెద్దగా ఉండదని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క అసలు పార్టీ మారే అవకాశాలే లేవని, ఎమ్మెల్యే పోడెం వీరయ్య విషయంలో శషభిషలున్నా ఆయన కూడా బీజేపీలోకి వెళ్లలేరని అంటున్నారు. ఎమ్మెల్యేలే కాకుండా జిల్లాల నుంచి ఇతర సీనియర్‌ నేతలు కూడా బీజేపీలో చేరడం వంటిది జరగకపోవచ్చునని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు