ఎల్‌ఆర్‌ఎస్‌: ‘3 లక్షల కోట్లు దండుకోవాలని చూస్తోంది’

5 Oct, 2020 16:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా కష్టకాలంలోనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల రక్తం పిండుకుంటుందని కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా కేవలం రంగారెడ్డి జిల్లాలోనే లక్ష కోట్లు వస్తాయని సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ప్లాన్‌ చేశారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ పేరు మీద మూడు లక్షల కోట్లు దండుకోవాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ఎంపీ మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్‌ చీకటి జీవోను తీసుకువచ్చిన ప్రభుత్వం.. 30 నుంచి 40 ఏళ్ల సంవత్సరాల లేఔట్‌లను కూడా రెగ్యులరైజ్‌ చేసుకోవాలనుకుంటుందని దుయ్యబట్టారు. చదవండి: ఎల్‌ఆర్‌ఎస్‌: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

‘ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోవాలని కేసీఆర్‌, కేటీఆర్‌ పేపర్‌లో కూడా ప్రచారంచేసుకుంటున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశాం. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తాం. తప్పుడు లే ఔట్ కు బాధ్యత ప్రభుత్వానిదే. ఎవరు కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లై చేసుకోవద్దు. రెగ్యులరైజ్ కోసం ఎవరు డబ్బులు కట్టవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తాం.’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు