కేసీఆర్‌ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్లొచ్చు

21 Jan, 2023 04:34 IST|Sakshi

కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జికి ఈ విషయం చెప్పా

పార్టీని సిద్ధం చేయాలని, 50–60 సీట్లకు అభ్యర్థులను ముందే ప్రకటించాలని ఠాక్రేకి సూచించా..

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి 

రేవంత్‌రెడ్డితో రెండుసార్లు భేటీ అయిన సీనియర్‌ నేత

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, పార్టీని అందుకు సిద్ధం చేయాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రేతో చెప్పానని ఆ పార్టీ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయనతో చర్చించానన్నారు. కోమటిరెడ్డి చాలా రోజుల తర్వాత గాంధీభవన్‌కు వచ్చారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు గత ఏడాది అక్టోబర్‌ 17న పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన, మళ్లీ శుక్రవారం సాయంత్రం మాణిక్‌రావ్‌ ఠాక్రేను కలిసేందుకు గాంధీభవన్‌లో అడుగు పెట్టారు. రాష్ట్ర ఇన్‌చార్జిగా మాణిక్యం ఠాగూర్‌ను మార్చిన తర్వాత పార్టీలో క్రియాశీలంగా మారుతు న్న కోమటిరెడ్డి, గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోనూ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఠాక్రేను కలిసి తన అభిప్రాయాలు (మనసులోని మాటలు) వెల్లడించిన అనంతరం, మరోమారు రేవంత్‌తో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉప్పు, నిప్పులా వ్యవహరించే ఆ ఇద్దరు నేతలు రెండుసార్లు భేటీ అయి ఏం మాట్లాడుకున్నారనేది కాంగ్రెస్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా ఠాక్రేతో భేటీకి ముందు, ఆ తర్వాత వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

గాంధీభవన్‌ మీటింగ్‌లు తగ్గించాలని చెప్పా..
రాష్ట్రం ఇచ్చిన సోనియా రుణం తీర్చుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్ని కల్లో పోటీ చేసే 50–60 మంది అభ్యర్థులను ముందే ప్రకటించాలని, ఎన్నికలకు వారం, పది రోజుల ముందు ప్రకటిస్తే ఉపయోగం ఉండదని సూచించానని కోమటిరెడ్డి చెప్పారు. రానున్న ఆరు నెలలు ప్రజా పోరాటాలు బలంగా చేయాలని, ఆ మేరకు కార్యకర్తల్ని సిద్ధం చేయాలని, గాంధీభవన్‌ మీటింగ్‌లు తగ్గించి ప్రజల్లో ఉండాలని, జిల్లాల్లో సమా వేశాలు పెట్టాలని చెప్పినట్లు తెలిపారు. ఇందుకు ఠాక్రే సానుకూలంగా స్పందించారని చెప్పారు.

గాంధీభవన్‌తో 30 ఏళ్ల అనుబంధం
గాంధీభవన్‌కు రానని తానెప్పుడూ అనలేదని వెంకట్‌రెడ్డి చెప్పారు. తనకు 30 ఏళ్లుగా గాంధీభవన్‌తో అనుబంధముందని, కాంగ్రెస్‌ జెండాతోనే పని చేస్తున్నానని అన్నారు. ఈనెల 26 నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. రూ.200 కోట్లు ఖర్చు పెట్టి ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ సభ పెట్టిన కేసీఆర్‌ దేశానికి ఏం చేస్తాడో చెప్పలేదని విమర్శించారు. ఇలాంటి సభలు కాంగ్రెస్‌ ఎన్నో పెట్టిందన్నారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమకు 40–50 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో విభేదాలు లేవని, నేతలందరం కలిసే ఉన్నామని చెప్పారు.  

మరిన్ని వార్తలు