కంచుకోటను కన్నెత్తి కూడా చూడట్లేదు

13 Oct, 2020 12:14 IST|Sakshi

సాక్షి, నల్గొండ : ఒకప్పుడు కాంగ్రెస్ కంచు కోటగా ఉన్న నల్గొండ నేడు నాయకుడు లేక అనాథగా మారింది. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్క ఓటమితో నల్లగొండ అసెంబ్లీ పరిధిలో కనీసం అడుగుపెట్టడం లేదు. అలాఅని ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కూడా నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా చూస్తున్నారు. దీంతో కాంగ్రెస్ క్యాడర్ అంతా పూర్తి అయోమయంలో ఉన్నారు. ఇన్నాళ్లు కోమటిరెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకున్న కార్యకర్తలను కోమటిరెడ్డి కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నల్గొండ ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యాక ఇప్పటి వరకు నియోజకవర్గ ముఖం చూసిన దాఖలాలు లేవని అభిమానులు నిరాశ చెందుతున్నారు. (బీజేపీలో.. పదవుల ముసలం..!)

కంచర్లకు జై కొడుతున్నారు
భువనగిరి ఎంపీగా గెలవడంతో పూర్తిగా ఆ పార్లమెంట్ పరిధిలోనే సమయం కేటాయిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఓటమి చెందినా.. ఎంపీగా తమ నేత గెలిచాడని సంబరపడ్డ నియోజకవర్గ ప్రజలు గెలిచాక తమని మర్చిపోయారని బాధపడుతున్నారు. ఇదిలావుండగా కోమటిరెడ్డి ఎంపీగా గెలవడం స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి, క్యాడర్‌కు కలిసొచ్చింది. కాంగ్రెస్‌పై గెలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డికి వార్ వన్ సైడ్లా ఉంది. కోమటిరెడ్డి నల్గొండకు రాకపోవడంతో క్యాడర్ అంతా కంచర్లకు జై కొడుతున్నారు. కార్యకర్తలు కోసం నిరంతరం పనిచేసే కోమటిరెడ్డి రాకపోవడంతో పోలీస్ స్టేషన్‌, రెవిన్యూ కార్యాలయాలో పనులు కాక గ్రామాల్లో ఉన్న హస్తం కార్యకర్తలంతా కారెక్కేస్తున్నారు.

కోమటిరెడ్డిపైనే ఆశలు..
వెంకటరెడ్డి నియోజకవర్గంలో అడుగు పెట్టకపోవడానికి ప్రధాన కారణం ప్రోటోకాల్ సమస్యగా తెలుస్తోంది. మంత్రిగా, ఎమ్మెల్యేగా 20 ఏళ్ల పాటు నియోజకవర్గంలో చక్రం తిప్పినా.. తాజాగా మారిన రాజకీయ పరిణామాల క్రమంలో ఇక్కడ అడుగుపెట్టాలంటే పెట్టలేకపోతున్నారు. ఇక ఎంపీగా ఉత్తమ్ ఉన్నప్పటికీ కోమటిరెడ్డిని కాదని క్యాడర్ ఎవరూ ఉత్తమ్కి సపోర్ట్ చేయకపోవడంతో ఆయన కూడా నల్గొండను మర్చిపోయారు. కోమటిరెడ్డి రాకపోవడం, ఉత్తమ్ పట్టించుకోకపోవడంతో చాలా మంది కార్యకర్తలు, స్థానిక నేతలు పార్టీ మారగా కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇంకా కోమటిరెడ్డిపై ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి 20ఏళ్ల పాటు సేవచేసినా.. గత ఎన్నికల్లో ఓటమి చెందడంతో తన విలువ ఏంటో తెలియాలని నియోజకవర్గంలో అడుగుపెట్టడం లేదని స్థానిక నేతలు గుసగుసలాడుతున్నారు.

మరోవైపు కోమటిరెడ్డిని కాదని ఇక్కడ నియోజకవర్గ ఇంచార్జిని పెట్టె ధైర్యం ఎవరు చేయడం లేదు. ఇక దసరా తర్వాత నియోజకవర్గంలో అడుగుపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నల్గొండలోనే కొత్త ఇల్లు కట్టుకోడానికి విజయదశమికి ముహూర్తం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి దసరా నాటికైనా కోమటిరెడ్డి నల్గొండలో అడుగుపెడతారా లేక ఎంపీగా పూర్తి సమయం భుమనగిరికే కేటాయిస్తారా అనేది దసరా నాటికి తెరపడనుంది.

మరిన్ని వార్తలు