Komatireddy Venkat Reddy: టీపీసీసీ.. టీడీపీ పీసీసీగా మారుతుంది

28 Jun, 2021 01:18 IST|Sakshi

ఓటుకు నోటు తరహాలోనే పీసీసీ ఎంపిక 

ఆ పదవిని పార్టీ ఇన్‌చార్జి అమ్ముకున్నారు..

ఇక గాంధీ భవన్‌ మెట్లెక్కను

ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌/ శంషాబాద్‌: అనుకున్నట్టే ఢిల్లీ నుంచి వచ్చీ రాగానే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘అగ్గి’రాజేశారు. తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తారని అనుకున్నానని, కానీ ఓటుకు నోటు తరహాలోనే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరిగిందని ఢిల్లీ వెళ్లాక తెలిసిందని వ్యాఖ్యానించారు. కొత్తగా రాష్ట్రానికి వచ్చిన పార్టీ ఇన్‌చార్జి పీసీసీ పదవిని అమ్ముకున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయటపెడతానని చెప్పిన కోమటిరెడ్డి.. ఇకపై తాను గాంధీ భవన్‌ మెట్లుఎక్కనని శపథం చేశారు. తన రాజకీయ భవిష్యత్తును కార్యకర్తలే నిర్ణయిస్తారని చెప్పారు.

తన పార్లమెంటు నియోజకవర్గంతోపాటు నల్లగొండ జిల్లాలో పార్టీ, ప్రజల కోసం పనిచేస్తానని, పార్లమెంటులో తన గళం వినిపిస్తానని అన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తనని, తనకే న్యాయం జరగకపోతే కేడర్‌లో ఆందోళన పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘నేటి నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా భువనగిరి వరకు పాదయాత్ర చేస్తాను, ప్రజల మధ్యనే ఉంటూ కొత్త నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహిస్తాను’ అని ఆయన అన్నారు. టీపీసీపీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఆ పదవికి రేవంత్‌రెడ్డితోపాటు కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో పోటీపడిన విషయం తెలిసిందే. 

నన్ను కలిసేందుకు రావద్దు
గాంధీ భవన్‌ తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా, టీపీసీసీ ఇకపై టీడీపీ పీసీసీగా మారిపోతుందని వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. కొత్త టీపీసీసీ కార్యవర్గానికి అభినందనలు తెలిపిన ఆయన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కొత్త కార్యవర్గం నాయకత్వంలో కనీసం డిపాజిట్లు తెచ్చుకొని చూపించాలని అన్నారు. కొత్త కార్యవర్గం కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులు కానీ, అధ్యక్షుడితో సహా ఎవరూ తనను కలిసేందుకు రావద్దని కోమటిరెడ్డి చెప్పారు. ఇప్పటికే తనను కలుస్తానని తన మనుషుల ద్వారా అడిగిస్తున్నారని, అలాంటి ప్రయత్నాలు చేయవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా, రాహుల్‌ గాంధీలను తాను విమర్శించబోనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు