సింగరేణిలో 40వేల కోట్ల అవినీతి.. కేసీఆర్‌, కేటీఆర్‌లు అదానీ కోసమే!. ఎంపీ కోమటిరెడ్డి ఫైర్‌

6 Jul, 2022 17:38 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లపై  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ దొంగలే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. 

బుధవారం యాదాద్రి భువనగిరిలో బొమ్మల రామారం  మండలం రామలింగపల్లిలో జగ్జీవన్ రామ్, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇద్దరూ అదానీలకే దోచిపెడతారని, దానికి తానే సాక్ష్యమని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. సింగరేణిలో భారీ అవినీతిని త్వరలో బయటపెడతానన్న ఎంపీ కోమటిరెడ్డి.. సుప్రీం కోర్టుకు వెళ్లైనా సరే రూ.40 వేల కోట్ల ప్రజాధనం కాపాడతానని చెప్పుకొచ్చారు.

సింగరేణిలో అవినీతిని ప్రజలకు వివరిస్తానని, ఆధారాలతో సహా బయటపెడతానని ఆయన అన్నారు. అహ్మదాబాద్ ను ఆదానీబాద్ గా మార్చుకోండని కేటీఆర్ అంటున్నారని, మరి కేటీఆర్‌ చేసేదేంటని కోమటిరెడ్డి నిలదీశారు. ఒడిషాలోని కోల్ మైన్ ను సింగరేణికి అప్పగిస్తే దాన్ని ఆదానీ, ప్రతిమ శ్రీనివాస రావుకు అప్పగించి స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయమై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తానని, పోరాటం చేస్తానని చెప్పారు. పార్లమెంట్‌లోనూ ఈ విషయమై గళం విప్పుతానని ఆయన అన్నారు. 

‘‘యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కి వస్తే యాభై కోట్ల ప్రజా ధనం వృధా చేశారు. దళిత బంధు ఈ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల వరకే ఇస్తుంది. ఈ తొమ్మిదేళ్లలో ఊరికి తొమ్మిది ఇళ్లను కూడా నిర్మించలేదు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం లేదు’’ అంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

మరిన్ని వార్తలు