ఉత్తమ్‌తో 3 గంటల భేటీ.. ఆ వెంటనే కోమటిరెడ్డి ఢిల్లీ టూర్‌!

21 Jun, 2021 04:06 IST|Sakshi

రసకందాయంలో టీపీసీసీ అధ్యక్ష వ్యవహారం..

ఉత్తమ్‌తో 3 గంటలపాటు భేటీ అయిన ఎంపీ కోమటిరెడ్డి?

అనంతరం ఢిల్లీకి.. ఇటీవలే అక్కడ 4 రోజులు మకాం.. కేసీ వేణుగోపాల్‌తో సమావేశం..

తాజాగా మళ్లీ హస్తిన పయనంతో ఉత్కంఠ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష వ్యవహారం రసకందాయంలో పడింది. నేడో, రేపో ఎప్పుడైనా అధిష్టానం పార్టీ కొత్త సారథిని ప్రకటిస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో హైదరాబాద్‌ కేంద్రంగా ఇరువురు ముఖ్య నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జన్మదినం కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఉత్తమ్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మూడు గంటల పాటు భేటీ అయినట్లు తెలిసింది. టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం, ఢిల్లీ పెద్దల ఆలోచన, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఇద్దరు చర్చించారని సమాచారం. ఈ ఇద్దరి భేటీ అనంతరం సాయంత్రం ఎంపీ కోమటిరెడ్డి హడావుడిగా ఢిల్లీ వెళ్లిపోవడం చర్చకు దారితీసింది.

మళ్లీ.. ఇంత తొందరగా..: ఎంపీనే అయినా వెంకట్‌రెడ్డి వారం తిరక్కముందే హస్తినకు వెళ్లడం హాట్‌టాపిక్‌గా మారింది. అదీ ఉత్తమ్‌తో భేటీ తర్వాత ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇటీవలే కోమటిరెడ్డి ఢిల్లీ వెళ్లి నాలుగు రోజులు అక్కడే ఉండి వచ్చారు. తన పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలసిన ఆయన పనిలో పనిగా కాంగ్రెస్‌ పెద్దలనూ కలసివచ్చారు.

గత పర్యటనలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కె.సి.వేణుగోపాల్‌ను కలసిన కోమటిరెడ్డి తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించేందుకు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌కు ఫోన్‌ చేసి కొంత కటువుగానే మాట్లాడారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం టీపీసీసీ అధ్యక్ష ఎంపిక వ్యవహారం గురించి 10 జన్‌పథ్‌ పెద్దలతో మాట్లాడేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారని సన్నిహితులు చెపుతుండటం గమనార్హం. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే...!   

మరిన్ని వార్తలు