మునుగోడులో ఎవరు గెలుస్తారో నాకు తెలుసు.. రేవంత్‌ కాంగ్రెస్‌ను ఏదో చేయాలనుకుంటున్నాడు: వెంకటరెడ్డి

5 Aug, 2022 16:25 IST|Sakshi

న్యూ ఢిల్లీ: తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై.. భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి మండిపడ్డారు. మునుగోడులో గెలవబోయేది ఎవరో తనకు తెలుసని.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని ఏదో చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం..  ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ తాను అందుబాటులో ఉండనని తెలిసే చండూరులో రేవంత్‌ సభ పెట్టారని ఆక్షేపించారు వెంకటరెడ్డి.

పీసీపీ ప్రెసిడెంట్‌ అందరినీ ఇబ్బందిపెడుతున్నారు. నన్ను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకున్నారు. నా లోక్‌సభ పరిధిలో నన్ను అడగకుండానే రేవంత్‌ ఎలా మీటింగ్‌ పెడతారు? లోకల్‌ ఎంపీకి చెప్పకుండా సభ పెట్టడం తప్పు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తిని నేను. 

పదవుల కోసం వెంటపడే వ్యక్తి కాదు. నేను ఎవరికీ భయపడను. పాత కాంగ్రెస్‌ నేతలందరినీ పార్టీ నుంచి వెళ్లగొడుతున్నావు. కాంగ్రెస్‌ వాళ్లంతా పోతే టీడీపీ వాళ్లని చేర్చుకుంటారా?. మునుగోడులో ఎవరు గెలుస్తారో నాకు తెలుసు. నేను పార్టీ మారితే అందరికీ చెప్పే వెళ్తాను. కాంగ్రెస్‌ను రేవంత్‌ ఏం చేయాలనుకుంటున్నాడో.. సోనియా, రాహుల్‌ దగ్గర తేల్చుకుంటాం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 

ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ఈ రోజు మూడు ముఖ్యమైన సమావేశాలు జరిపినట్లు తెలిపారు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి.. తెలంగాణకు రూ. వెయ్యి కోట్ల వరద సహాయం చేయమని అడిగినట్లు చెప్పారు. అంతేకాదు ప్రజా సమస్యల పరిష్కారానికే హోం మంత్రిని కలిసినట్లు స్పష్టత ఇచ్చారు. 

మునుగోడు సభ కంటే అభివృద్ధి ముఖ్యం కాదా అని ప్రశ్నించారు. అమిత్‌షాను తెలంగాణలో ఏరియల్ సర్వే చేయమని కోరానని, రూల్ 377 కింద ఫ్లడ్స్ విషయాన్ని లేవనెత్తానని. ఆర్థిక శాఖ సంప్రదింపుల సమావేశానికి హాజరయ్యానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: హోం మంత్రి అమిత్‌ షాను విడివిడిగా కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌

మరిన్ని వార్తలు