అమావాస్యనాడు పవన్‌ తొందరపాటు! ఫలితం.. ఢిల్లీకి ఉరుకులు

15 Sep, 2023 11:25 IST|Sakshi

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు చేసిన ప్రకటన పెద్ద ఆశ్చర్యపరచ లేదు. కానీ.. ఆయన ప్రకటించిన తీరు, సందర్భం, తెర వెనుక జరిగిన ఘట్టాలపై వస్తున్న సమాచారం పరిశీలిస్తే కొంత విస్తుపోక తప్పదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో అన్ని విషయాలలో ఒప్పందం అయ్యాకే ఈ పొత్తు ప్రకటన చేశారా?లేదా? అనేది చర్చనీయాంశంగా ఉంది. అందులోను జనసేనతో  పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలకు ఒక్క మాట కూడా చెప్పకుండా పవన్ కల్యాణ్ ఈ ప్రకటన చేయడంతో టీడీపీలో మరింత కంగారు ఏర్పడినట్లు చెబుతున్నారు. అందుకే ఎలాగోలా బీజేపీ పెద్ద నాయకులను కలిసి తమవైపు నుంచి తప్పు లేదని వివరణ ఇచ్చుకోవడానికే చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌లు కలిసి అర్జంట్గా ఢిల్లీ వెళ్లినట్లు రాజకీయవర్గాలలో ప్రచారం ఉంది.

నైపుణ్యాభివృద్ది సంస్థ స్కామ్ లో అరెస్టు అయి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడును  పరామర్శించి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ జైలు వద్దే పొత్తు  ప్రకటన చేయడంలో ఆయన తొందరపడ్డారన్న భావన ఇరు పార్టీలలో ఉందట. అమావాస్య రోజున.. ఆ విషయం గమనించకుండా పవన్ ఇలా చేశారేమిటా? అని వారు తలలు పట్టుకుంటున్నారట. పోనీ.. చంద్రబాబుతో అన్ని వివరాలు మాట్లాడారా? అంటే అదీ స్పష్టత లేదు. పైగా టీడీపీ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం చంద్రబాబును పవన్ కల్యాణే  పొత్తు గురించి అభ్యర్ధించినట్లు ఉండడం కూడా జనసేనకు పరువు తక్కువ అయింది.

ఒకవైపు చంద్రబాబుతో గట్టిగా సీట్ల బేరం చేసుకునే అవకాశం ఉండగా, దానిని వదలిపెట్టి తెలుగుదేశం పార్టీని తానే రక్షించాలన్నట్లుగా హడావుడిగా పవన్ ప్రకటన చేయడం జనసేనలోని చాలా మందికి జీర్ణం కాకపోవచ్చు. పార్టీ కార్యాలయంలో ముఖ్యులతో మాట్లాడి, అలాగే టీడీపీతో సంప్రదింపులు జరిపి , అన్ని విషయాలపై ఒక అవగాహనకు వస్తే ఫర్వాలేదు. కాని, ఇలా తొట్రుపాటుగా వ్యవహరించడం వల్ల జనసేనకు అధిక నష్టం వాటిల్లుతుందన్నది ఒక అభిప్రాయం. పవన్ ఎందుకు ఇలా ఎలా  చేశారన్నదానిపై ఒక ఆసక్తికరమైన సమాచారం వచ్చింది.

✍️ చంద్రబాబు కుమారుడు లోకేష్, బావమరిది బాలకృష్ణలతో కలిసి పవన్ కళ్యాణ్ ములాఖత్‌కు వెళ్లారు. కొద్దిసేపు పరామర్శల అనంతరం చంద్రబాబు,పవన్ లు కొంచెం విడిగా వెళ్లి రాజకీయ విషయాలు మాట్లాడుకున్నారు. ఆ సందర్భంలో తనపై ఉన్న కేసుల రీత్యా మరో రెండు, మూడు నెలలు జైలు నుంచి బయటకు రావడం కష్టం కావొచ్చని, ఈలోగా పార్టీ మరింత దెబ్బతినకుండా పవన్ తన వంతు సహకారం అందించాలని కోరారని అంటున్నారు. బాలకృష్ణ, లోకేష్‌ల వల్లే ఇది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారట. ఎటూ పొత్తు ఉంటుందన్న అభిప్రాయం ఉంది కనుక ఆ పాయింట్ కన్నా.. టీడీపీలో కూడా నైరాశ్యం పెరగకుండా చూడడానికి పవన్ యాత్రలు కొనసాగిస్తే బెటర్ అని చెప్పి ఉంటారని కొందరు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ బయటకు వచ్చి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తూ.. సడన్‌గా పొత్తు అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు. ఈ విషయం బాలకృష్ణ, లోకేష్ లకు తెలియదని.. అందుకే వారు ఆ సంగతి  మాట్లాడకుండానే వెళ్లిపోయారని అంటున్నారు. లోకేష్ అయితే ఆ సమయంలో  బిత్తర చూపులతో కనిపించారని అంటున్నారు.

✍️ మామూలుగా అయితే పవన్ చెప్పిన తర్వాత దానిని నిర్దారిస్తూ టీడీపీ నేతలు కూడా మాట్లాడవలసి ఉంటుంది. అదేమీ జరగలేదు. ఇదే సమయంలో టీడీపీ ముఖ్యనేతలు కొందరికి మరో భయం పట్టుకుంది. ఇప్పటికే చంద్రబాబుకు  ఆదాయపన్ను శాఖ ఇచ్చిన రూ. 118 కోట్ల బ్లాక్ మనీ నోటీసు వ్యవహారం మెడమీద ఉంది. ఈ టైమ్ లో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్న జనసేనను విడదీసి.. టీడీపీ కలుపుకుంటే?  ఆ పార్టీ పెద్దలకు ఆగ్రహం వస్తే?.. అది మరింత సమస్య అవుతుందని భయపడ్డారట. దాంతో టీడీపీ ముఖ్య సలహాదారులు కొందరు వెంటనే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి తమకు తెలియకుండానే పవన్ ఈ ప్రకటన చేశారని చెప్పాలని సూచించారట. అందుకే  భువనేశ్వరి, లోకేష్‌లు హుటాహుటిన ఢిల్లీ పయనం అయి వెళ్లారని చెబుతున్నారు. కాకపోతే ఆ మాట నేరుగా చెప్పలేరు కనుక.. ఢిల్లీలో జాతీయ మీడియాకు ప్రజెంటేషన్ కోసం వెళ్లినట్లు టీడీపీ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారట!.

ఇప్పటికే ప్రధాన మంత్రి,హోం మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడి అపాయింట్‌మెంట్‌ కోరారట. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తమకు కొత్త ఇబ్బంది తెచ్చారేమోనన్న ఆందోళన ఒక వైపు..  పవన్ ఎటూ పొత్తు ప్రకటన చేశారు కనుక ఇక వెనక్కి పోలేడులే అన్న ధీమా మరో వైపు టీడీపీలో ఉందని అంటున్నారు. అయితే టీడీపీ మీడియాలో మాత్రం చంద్రబాబును పవన్ కల్యాణే అడిగి మరీ పొత్తు  పెట్టుకున్నారని రాశారు. ‘పొత్తు  ఈ టైమ్‌లోనా?’’ అని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేసినా.. పవన్ వెనక్కి తగ్గలేదని, పైగా మీకేమైనా అభ్యంతరమా? అని అడిగారని టీడీపీ మీడియా చెబుతోంది. అది నిజమే అయితే పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహంలో మరోసారి విఫలం అయినట్లేనని విశ్లేషకుల భావన.

✍️ టీడీపీ అధినేత అవినీతి కేసులో ఇరుక్కుని జైలుపాలైతే.. ఆ పార్టీ క్యాడర్ నైతికంగా దెబ్బతిన్న సమయంలో పవన్ కల్యాణ్ తన గ్రాఫ్ పెంచుకోవలసింది పోయి.. ఇలా టీడీపీకి సరెండర్ అవ్వడం ఏమిటనే? ప్రశ్న జనసేనలోనే వినవస్తోంది. నిజానికి ఏ పార్టీతో పొత్తు అయినా, కొన్ని నిర్దిష్ట షరతులు ఉంటాయి. ముఖ్యంగా సీట్లు ఎన్ని?.. ముఖ్యమంత్రి పదవి ఎవరికి.. ఎంతకాలం ఇవ్వాలి? అనేవాటిపై క్లారిటీ ఉండాలి. అవేవి లేకుండానే పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన చేయడం జనసేనలో అయోమయానికి ఆస్కారం ఏర్పడింది.

✍️ ఒక ఆంగ్ల పత్రిక రాసిన వార్త ప్రకారం పవన్ కళ్యాణ్ 30 సీట్లకు ఓకే చేయవచ్చట. అదే కరెక్టు అయితే జనసేన పరువు పోయినట్లే అవుతుంది. జనసేన అభిమానులుకాని, వారికి మద్దతు ఇచ్చే ఒక టీవీ చానల్ కాని ఏమి ఆశిస్తున్నదంటే.. 75 సీట్లు అయినా పవన్ కళ్యాణ్ తీసుకోవాలని.. లేదంటే కనీసం 50 సీట్లకు పట్టుబట్టాలని!. అలాకాకుండా 25 లేదా 30 సీట్లకు పవన్ ఓకే చేసి ఉంటే అది పార్టీ క్యాడర్ లో తీవ్ర నిరాశ అవుతుంది. ఇక ముఖ్యమంత్రి పదవిని షేర్ చేసుకోవడానికి చంద్రబాబు ఒప్పుకున్నారా?లేదా? అనేది కూడా స్పష్టం కావల్సి ఉంటుంది.

✍️సీఎం పదవితో సంబంధం లేకుండా పవన్ అవగాహనకు వస్తే.. కాపు సామాజికవర్గం, ఆయన అభిమానులు  సహించే పరిస్థితి ఉండదు. కేవలం చంద్రబాబును కాపాడే తీరున చివరికి ఆయనపై వచ్చిన అవినీతి కేసుల్లో కూడా మద్దతు ఇచ్చే పరిస్తితి జనసేనకు ఏ మాత్రం ప్రతిష్టకాదు. అవినీతికి పవన్ కల్యాణ్ మద్దతు ఇస్తున్నారని, అందుకు ప్యాకేజీ తీసుకున్నారని ప్రత్యర్ధులు  ప్రచారం చేసే అవకాశం ఉందని జనసేన వర్గాలు భయపడుతున్నాయి. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నేతలు ఇదంతా ప్యాకేజీ అని వ్యాఖ్యానిస్తున్నారు. దానికి తగ్గట్లే పవన్ కల్యాణ్ ప్రకటన చేసినట్లు  ఉందన్న అభిప్రాయం వ్యాప్తిలోకి వెళ్లవచ్చు. ఇది మరింత నష్టం చేయవచ్చు. ఇక పొత్తు ప్రకటనతో బీజేపీని ఆయన కూడా ఇరుకునపడేశారు. 2019 లో ఓటమి తర్వాత.. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమలాడి మరీ పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు వారితో సంబంధం లేకుండా, టీడీపీతో పొత్తు ప్రకటన చేయడం వారిని అవమానించడమే అవుతుంది. ప్రధాని మోదీని తీవ్రంగా దూషించిన చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకోవడం సహజంగానే బీజేపీ ఒరిజినల్ వర్గం వారికెవ్వరికి రుచించదు. పుండుమీద కారం చల్లినట్లు.. బీజేపీతో కాపురం చేస్తూ, సహజీవనం చేస్తున్న టీడీపీతోనే వెళతానని అన్నట్లుగా పవన్ ప్రకటించడం దారుణమని, ఇది అనైతికమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

✍️స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో చంద్రబాబుపై వచ్చిన  ఆరోపణలకు పవన్ ఇచ్చిన సమాధానం విన్న తర్వాత.. ఈయన తెలిసి మాట్లాడుతున్నారా?లేక తెలియక మాట్లాడుతున్నారా? అనే అభిప్రాయం సహజంగా ఎవరికైనా కలుగుతుంది. చంద్రబాబు సంతకాలు లేకుండా ఆయనపై కేసు ఏమిటని ప్రశ్నించారు. కాని చంద్రబాబు పదమూడుచోట్ల సంతకాలు చేశారని సీఐడీ అధికారులు పైళ్లతో సహా చూపించడంతో.. పవన్ గాలి పోయినట్లు అయింది. అనవసర విషయాలు మాట్లాడి చంద్రబాబును మరింత ఇరకాటంలో పెట్టినట్లయిందన్నది మరో అభిప్రాయంగా ఉంది. ప్రస్తుతం చంద్రబాబుపై అవినీతి స్కామ్‌లులు ,ఇతర కేసుల ప్రచారాన్ని డైవర్ట్ చేయడానికి.. ఇంతవరకు ఆశించిన స్థాయిలో సానుభూతి రాకపోవడంతో ఏమి చేయాలన్నదానిపై ఆలోచనలో భాగంగా పవన్ కల్యాణ్ మద్దతు తీసుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తుంటే.. ఆయన మాత్రం టీడీపీని మరో కొత్త సంక్షోభంలోకి తీసుకువెళ్లారేమోనని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. బీజేపీ పట్టించుకోకపోతే ఫర్వాలేదుకాని ఒకవేళ సీరియస్ అయితే ఏమిటా? అనే ఆందోళన టీడీపీలో ఉంది. పవన్ పొత్తు ప్రకటన చేసినా, ఇరు పార్టీల మధ్య పూర్తి స్థాయిలో అవగాహన కుదరడం అంత తేలిక కాదని, ముందుంది ముసళ్ల పండగ అనేవారు కూడా లేకపోలేదు.


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

మరిన్ని వార్తలు