‘గురువులకే పరీక్ష’.. రామోజీ స్కూల్‌ నుంచి లాజిక్‌ లేని పాఠాలు

6 May, 2022 09:16 IST|Sakshi

ఒకప్పుడు మీడియా అయినా, రాజకీయ పార్టీలు అయినా.. విద్యార్దుల చదువుల విషయానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా స్పందించేవి. వారి భవిష్యత్తు దెబ్బతినకూడదన్న స్పష్టమైన అవగాహనతో ఉండేవి. ఉపాధ్యాయులు వారి వృత్తికి నిబ్బందులై ఉండేవారు. అలాగని అసలు అక్రమాలు జరగలేదని కాదు. కాకపోతే గతంలో సామూహికంగా ప్రశ్నాపత్రాల లీకేజీలతో రాష్ట్రం అంతా అట్టుడికి పోయేది. పత్రికలలో నిత్యం ఏదో ఒక పరీక్ష ప్రశ్నపత్రం ముద్రితమయ్యేది. అది వాస్తవమైనదా? కాదా? అన్నది నిర్దారించుకున్న తర్వాత ప్రభుత్వం స్పందించేది. అవసరమైతే ఆ పరీక్షను రద్దు చేసేది. కానీ ఇప్పుడు.. 

ఆ దశ నుంచి ఎక్కడైనా ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా బయటకు వస్తే అది అక్కడికే పరిమితం అవుతోంది. ఇది కొంతలో కొంత బెటర్. దీనివల్ల సంబంధిత నేరం చేసినవారిని గుర్తించి అరెస్టు చేసే అవకాశం కూడా తేలిక అయింది. ఇటీవలికాలంలో ఇలా వాట్పప్ లీక్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డ టీచర్లు, హెడ్ మాస్టర్ లు, ఇతరులు అంతా కలిపి సుమారు డెబ్బై మంది వరకు ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. విశేషం ఏమిటంటే.. ఇలా అరెస్టు అయినవారిలో కార్పొరేట్ స్కూల్ టీచర్లు, ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు ఉన్నారు. సమాజాన్ని సరైన మార్గంలో తీసుకు వెళ్లవలసిన ఈ ఉపాధ్యాయులే ఇలాంటి అక్రమాలకు ప్రోత్సహించడం శోచనీయం. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే చెడ్డపేరు కన్నా, టీచర్లు అంటే అసహ్యం ఏర్పడే పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని లక్షల మంది టీచర్లు ఉంటే అంతా కలిపి వంద లోపే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారు. అందువల్ల టీచర్లు అందరిని అనజాలం. అయితే ఈనాడు దినపత్రిక ‘గురువులకే పరీక్ష’ అంటూ ఒక కథనం రాసి మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వంపైన, పిల్లలపైన నెట్టే ప్రయత్నం చేసింది. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లాభం జరుగుతుందని ఆశించారో, లేక తెలివితక్కువగా కథనాన్ని ఇచ్చారో తెలియదో కాని.. వారు చెప్పినదాని ప్రకారం ప్రభుత్వస్కూళ్లలో వంద శాతం ఫలితాలు రావాలని ఒత్తిడి చేస్తున్నందునే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని వారు తీర్పు ఇచ్చేశారు. ఈ లెక్కన అక్రమాలు చేయడంలో తప్పు లేదని ఈ పత్రికవారు అభిప్రాయపడుతున్నట్లుగా ఉంది.

ఈనాడు పత్రికకు నిజాయితీ ఉంటే ఏమని రాయాలి?.. ఉపాధ్యాయలు పెడదోవపట్టరాదని, సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని, మాస్ కాపీయింగ్‌కు కాని.. వాట్సాప్ లీకేజీలకు కాని అవకాశం ఇవ్వరాదని రాయాలి. అలారాయకపోగా.. వారు ఏదో తప్పనిసరి పరిస్థితిలో అక్రమాలకు పాల్పడుతున్నారని, అందువల్ల వారు తప్పు లేదన్న చందంగా కథనాన్ని ఇవ్వడం శోచనీయం.  పోనీ అది కూడా ప్రైవేటు రంగ స్కూళ్ల గురించి ఏమైనా ప్రస్తావించారా? అంటే అదేమీ చేయలేదు. ఏదో సంస్థ సర్వే చేసిందని, దాని ప్రకారం ప్రమాణాలు లేకపోయినా, కొందరు ఇలా అక్రమాలకు పాల్పడి ఉత్తీర్ణులు అవుతున్నారని పేర్కొన్నారు. ఈ సర్వేని ప్రాతిపదికగా తీసుకుంటే ఈ పత్రిక టీచర్లకు మంచి సలహాలు ఇవ్వాల్సింది పోయి, పాపం వారేం చేస్తారని వాపోయింది. ప్రభుత్వ స్కూళ్లలోనే టీచర్లు ఒత్తిడికి గురి అవుతున్నారా? ప్రైవేటు స్కూళ్లలో టీచర్లు అంతా ఆడుతూ,పాడుతూ చేసుకుంటున్నారా? ఈనాడు వారికి కూడా ఒక స్కూల్ ఉంది కదా? అక్కడ టీచర్లు పాఠాలు చెప్పకపోయినా పర్వాలేదు.. నిర్దిష్ట లక్ష్యాల ప్రకారం పనిచేయకపోయినా పర్వాలేదని చెబుతున్నారా? అలా చేయరు కదా.. బోలెడంత అదనపు పని పెడుతుంటారు.

► అదొక్కటే కాదు. కార్పొరేట్ స్కూళ్లలో మెజార్టీ అలాగే చేస్తుంటాయి. సాయంత్రం స్కూల్ టైమ్ ముగిశాక, పిల్లలను స్టడీ క్లాస్ పేరుతో గంటల తరబడి కాపలా పెట్టి చదివిస్తుంటారు. మరి దీనిని ఏమంటారు? అయినా వారు ఉత్తీర్ణులు కాకపోతే ప్రైవేటు యాజమాన్యాలు ఊరుకుంటాయా? ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం టీచర్లను బాగా పనిచేయాలని అడగకూడదట. చివరికి రామోజీ లాజిక్ ఇలా తయారయ్యిందని అనుకోవాలి. అసలు ముందుగా పేపర్ వాట్సాప్ ద్వారా బయటకు వచ్చింది నారాయణ స్కూల్ నుంచే కదా. దానిని పోలీసులు సకాలంలో పసిగట్టి పలువురిని అరెస్టు చేశారు కదా? ఆ విషయం ఈ పత్రిక గానీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీగానీ ఎందుకు చెప్పడం లేదు. అంతేకాదు.. శ్రీకాకుళం జిల్లాలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఈ దిక్కుమాలిన పాపానికి పాల్పడ్డారట. వారికి ఒక తెలుగుదేశం టీవీ చానల్ జతకలిసిదంట. ఏపీలో రాజకీయం ఎంత క్షుద్రంగా తయారైందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా?. అయినా పోలీసులు ఆయా చోట్ల కఠినంగా వ్యవహరించి నిందితులుగా ఉన్న టీచర్లను అరెస్టు చేసినందుకు ప్రభుత్వాన్ని ప్రశంసించాలి కదా?.. అదే చంద్రబాబు టైమ్ లో ఇలాంటివి జరిగి అరెస్టు అయితే ఏమని రాసేవారు..ప్రభుత్వం సత్వరమే స్పందించి వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా సమర్ధంగా వ్యవహరించిందని రాసేవారు కదా.

► అదే పని జగన్ ప్రభుత్వం చేస్తే ‘గురువులకు పరీక్ష’ అంటూ పిచ్చి కథనాలు ఇస్తుంటారు.  వంద శాతం ఫలితాలు కావాలంటే ఎవరైనా పేపర్ లీక్ చేస్తారా? మాస్ కాపీయింగ్ చేసి మార్కులు సంపాదిస్తారా. దానిని మీడియా సమర్ధించడమా? మాస్ కాపీయింగ్ అన్న సమస్య ఇవ్వాళ్టిది కాదు. కొన్ని దశాబ్దాలుగా ఉంది. విద్యార్దుల తల్లిదండ్రులు, వారి సమీప బందువులు బయట నుంచి స్లిప్‌లు అందించి అక్రమాలకు పాల్పడుతుంటారు. ఇదే విషయం పై 2017లో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం కొన్ని చోట్ల సీసీటీవీలు ఏర్పాటు చేసి పరిశీలించిందట. అప్పుడు అనేక అవకతవకలు కాని, వివిధ నాసిరకం ప్రమాణాలు కాని బయటపడ్డాయట. తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీల ఏర్పాటు మాత్రం చేయలేదని ఆ పత్రికే రాసింది. అంటే ఇది ఎవరి తప్పు? ఆనాటి  ప్రభుత్వం సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని,కనీసం ఈ ప్రభుత్వం అయినా చేయాలని సలహా ఇచ్చి ఉంటే మంచిపనే అవుతుంది. అలా చేయకుండా ప్రస్తుత ప్రభుత్వంపై బురద చల్లాలన్న తపన ఆ కథనంలో కనిపిస్తుంది.

► ఈ ఒక్క అంశంలోనే కాదు. ఏపీలో ఎక్కడైనా రేప్ లేదా ఇతర నేరం జరిగితే, దానిని రాష్ట్రం అంతటికి వర్తింపచేస్తూ కధలు అల్లుతున్నారు. పోలీసులు అలాంటి ఘటనలు జరిగిన వెంటనే స్పందించి సంబందిత నిందితులను అరెస్టు చేయకపోతే ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. పోలీసులు తగు చర్యలు తీసుకున్నా, తెలుగుదేశం పార్టీకాని, వారి మీడియా కానీ ‘రేప్‌.. రేప్‌’ అంటూ గగ్గోలు పెడుతున్నాయి. దానికి కారణం ఒకటే ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న తాపత్రయమే. మంగళగిరి వద్ద జరిగిన ఒక ఘటనలో టీడీపీ నేతల హస్తం ఉందని బయటపడడంతో వీరంతా ఒక్కసారిగా గప్ చుప్ అయ్యారు. ఇప్పుడు వాట్సప్ లో ప్రశ్నా పత్రాల లీక్ విషయంలో కూడా ఎక్కువ చోట్ల టీడీపీకి సంబంధించినవారి హస్తం ఉందని బయటపడింది. నారాయణ విద్యాసంస్థలు.. మాజీ మంత్రి నారాయణకు సంబందించినవి. గతంలో ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటే, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా ఉండేవారు. అప్పుడు ఇలాంటి లీకేజీ ఘటనలు జరిగినా ప్రభుత్వం చూసి, చూడనట్లు పోయిందని, ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తుంటే.. లేనిపోని విమర్శలు చేస్తూ అసలు విషయాన్ని తప్పుదారి పట్టిస్తోందని వైఎస్సార్సీపీ వ్యాఖ్యానిస్తోంది.

► శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు టీడీపీ కార్యకర్తలు ఇలా ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుల్లో అరెస్టు అయ్యారు. ఒకవేళ ఇలా అరెస్టు అయినవారు వైఎస్సార్సీపీ వాళ్లు అయి ఉంటే?.. ఈనాడు, తదితర టీడీపీ పత్రికలు ఇల్లెక్కి చిందులు వేసేవి. వైఎస్సార్సీపీ వాళ్లే.. రాష్ట్రం అంతటా పేపర్లు లీక్ చేస్తున్నారని ప్రచారం చేసేవారు. ఇక్కడ మరో విషయం చెప్పాలి. టీచర్ల సంఘాలు కూడా ప్రభుత్వం ఏదో సమస్య పరిష్కరించలేదని నిరసనలకు దిగుతున్నాయి. కానీ, విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఆందోళన చెందకపోవడం దురదృష్టకరం. ఈ మధ్యకాలంలో బడులు మానేసి కొందరు గుండు కొట్టించుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అలాంటివారు ఈ రకంగా టీచర్లు అరెస్టు అయ్యే పరిస్థితి రావడం మంచిదేనా? కాదా? అన్నదానిపై ఎందుకు స్పందించడం లేదు?. వారు కూడా రాజకీయాలకు బాగా అలవాటు పడిపోయినందువల్లే ఇలా చేస్తున్నారా?. టీచర్లు అందరు అక్రమాలకు పాల్పడతారని కాదు. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలకు మురిసిపోయి పలువురు టీచర్లు చాలా బాగా పని చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా బెండపూడి ప్రభుత్వ స్కూల్ విద్యార్ధులు ఆంగ్లంలో మాట్లాడే తీరు చూస్తే ముచ్చటవేస్తుంది. ఇంగ్లీష్ మీడియంపై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు, రామోజీ వంటి వారితో సహా పలువురు పెద్దలు ఈ పిల్లలను చూసి ముక్కున వేలువేసుకోవాల్సిందే. ఇలా అన్ని స్కూళ్లు మారితే ఏపీకి ఎంత మంచి పేరు వస్తుంది.

► స్కూళ్ల భవనాలను మాత్రమే కాకుండా, స్కూళ్లలో విద్యాబోధన ప్రమాణాలను కూడా పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అంతా సహకరించవలసి ఉంది. అదే సమయంలో ప్రభుత్వపరంగా ఏవైనా లోపాలు జరుగుతుంటేవాటిని చెప్పవలసిన బాధ్యత అందరిపైనా ఉంటుంది. అలాకాకుండా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావాలన్న యావతో పిచ్చి,పిచ్చి కథనాలు రాస్తే.. ప్రజలు వాటిని గమనించలేనంత అమాయకులా? రామోజీ ఇంకా పాతచింతకాయ పచ్చడి భావాలతోనే ఉంటున్నారు తప్ప, సమాజం మారుతోంది.. వారికి మరింత మేలు చేద్దామని వార్తలు ఇవ్వడం లేదు. దానివల్ల  ప్రజల దృష్టిలో ఆయనే పలచన అవుతున్నారు..ఆ విషయాన్ని ఆయనే గమనించలేకపోతున్నారా? లేక గమనించినా రాజకీయం కోసం విలువలను వదలివేస్తున్నారా?

 

- కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు